ఒకేసారి ఎన్నికలు 9 రాష్ట్రాలకా.. 11 రాష్ట్రాలకా?

ఈ ఏడాది డిసెంబర్‌ లో ఐదు రాష్ట్రాలు.. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే

Update: 2023-09-13 06:36 GMT

ఈ ఏడాది డిసెంబర్‌ లో ఐదు రాష్ట్రాలు.. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'ఒకే దేశం -ఒకే ఎన్నికలు' కు మొగ్గు చూపుతోందని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది వేసవిలో ఎన్నికలు జరగాల్సి ఉన్న ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని టాక్‌ నడుస్తోంది. ఈ 9 రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది నవంబర్‌ లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలను కూడా కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాలకు, లోక్‌ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించిందని తాజాగా ఒక వార్త జాతీయ మీడియాలో హల్చల్‌ చేస్తోంది.

ఒకేసారి 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరపాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల కాల పరిమితిని పొడిగించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల కాల పరిమితిని తగ్గించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్‌ లోగా తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, మిజోరాంల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక షెడ్యూల్‌ ప్రకారం.. లోక్‌ సభకు వచ్చే వేసవిలో అంటే ఏప్రిల్‌/మే నెలల్లో ఎన్నికలు జర గాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు మొగ్గు చూపితే డిసెంబర్‌ లో ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలు.. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, మిజోరాం ప్రభుత్వాలను వచ్చే ఏడాది వేసవి వరకు పొడిగించాల్సి ఉంటుంది.

అలాగే షెడ్యూల్‌ ప్రకారం.. వచ్చే ఏడాది నవంబర్‌ లో ఎన్నికలు జరగాల్సి ఉన్న హరియాణా, మహారాష్ట్రల ప్రభుత్వాలను వచ్చే ఏప్రిల్‌/మేకే కుదించాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రభుత్వాలకు దాదాపు ఆరు నెలల కాలపరిమితి తగ్గిపోతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలకు వచ్చే ఏడాది వేసవిలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి కేంద్రానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి ఒకేసారి అటు పార్లమెంటుకు, ఇటు 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ ఇలా కాకుంటే ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపితే.. వచ్చే ఏడాది వేసవి వరకు కాలపరిమితి ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలను నాలుగైదు నెలలకు ముందుగానే అంటే ఈ ఏడాది డిసెంబర్‌ లోనే ఐదు రాష్ట్రాలు.. తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్‌ లతోపాటే ఎన్నికలు నిర్వహిస్తారని అంటున్నారు. ఇలా మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు, పార్లమెంటుకు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటే ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు.

దీనికి సంబంధించి ఈ నెల 18 నుండి 22 వరకు జరగబోయే పార్లమెంటుప్రత్యేక సమావేశాల్లో క్లారిటీ వస్తుందని టాక్‌ నడుస్తోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News