మలుపులు తిరుగుతున్న ఉస్మానియా కేసు
దీనిని రాష్ట్రప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కరంటు, నీళ్ల కొరత మూలంగా వార్డెన్ నెల రోజులు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థుల నిరసన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిని రాష్ట్రప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
రాష్ట్రంలో ఎక్కడా నీటి, విద్యుత్ కొరత లేదని స్వయంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వడంలేదని నిశ్చింతగా ఉండొచ్చని వెల్లడించారు.
అయితే ఈ విషయంలో ఫేక్ ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ను ప్రభుత్వం అరెస్టు చేసింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ స్పందిస్తూ మన్నె క్రిషాంక్ చేసింది తప్పుడు ప్రచారం కాదని, ముఖ్యమంత్రి రేవంత్ ఫేక్ ప్రచారం చేశాడని, రేవంత్ మీద చర్యలు తీసుకోవాలని, నేను చెప్పింది తప్పయితే నామీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
ఈ నేపథ్యంలో తాజాగా ఉస్మానియా విద్యార్థులు అక్కడి పోలీస్ స్టేషన్ లో తాజాగా ఫిర్యాదు చేశారు. ‘గత సంవత్సరం 2023లో చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీస్ ను ఫోర్జరీ చేసి విద్యార్థులను తప్పు దోవ పట్టించే విధంగా ట్విట్టర్ అకౌంట్ లో సర్క్యులేట్ చేసిన సిఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని’’ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.