జంప్ జిలానీలకు మినిస్టర్ పోస్టులు ?

ఏపీలో చూస్తే వైసీపీ నుంచి ఎన్నికల వేళకు వరసగా బయటకు వచ్చారు. అలా వచ్చిన వారు అంతా టీడీపీలో చేరారు.

Update: 2024-06-12 16:30 GMT

చివరి నిముషంలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దూకిన వారు గెలవడమే లక్ అనుకుంటే అలా గెలిచిన వారిని అక్కున చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వడం ఇంకా లక్ అని అంటున్నారు. ఆ పని టీడీపీ అధినేత చంద్రబాబు చేశారు.

ఏపీలో చూస్తే వైసీపీ నుంచి ఎన్నికల వేళకు వరసగా బయటకు వచ్చారు. అలా వచ్చిన వారు అంతా టీడీపీలో చేరారు. వారికి టికెట్లు కూడా వెంటనే దక్కాయి. అయినా వీరు గెలుస్తారా అన్న డౌట్లు ఉన్నాయి. కానీ వారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు.

టీడీపీ కూటమికి అనుకూలంగా వచ్చిన సునామీతో భారీ మెజారిటీలు సాధించారు. అందులో ముగ్గురు అయితే ఏకంగా మంత్రులే అయిపోయారు. ఆ లిస్ట్ చూస్తే కొలుసు పార్ధసారధి, ఆనం రామనారాయణరెడ్డి, రాం ప్రసాద్ రెడ్డి గా ఉన్నారు. ఈ ముగ్గురూ టీడీపీలోకి జంప్ అయ్యారు.

ఆనం విషయం తీసుకుంటే వైసీపీలో ఉంటూ ఆయన గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసారు. దాంతో ఆయన్ని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆ తరువాత ఆయన మీద అనర్హత వేటు వేశారు. అయితే ఈలోగానే ఆయన టీడీపీలో చేరి తన సీటుని కూడా కన్ ఫర్మ్ చేసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో రాజకీయంగా పెద్ద కుటుంబంగా ఉంటూ వచ్చిన ఆనం ఫ్యామిలీని చంద్రబాబు ఆదరించి మంత్రి పదవి ఇచ్చారు. అదే నెల్లూరులో మొదటి నుంచి పార్టీలో ఉంటూ పనిచేస్తున్న వారు గెలిచి మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారికి ఆ విధంగా ఝలక్ తగిలినట్లు అయింది.

అదే విధంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో చూసుకుంటే కొలుసు పార్ధసారధికి మంత్రి పదవి లభించింది. ఆయన కూడా వైసీపీని నుంచి టీడీపీలో ఎన్నికల ముందు చేరారు. ఆయనకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కడంతో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో పలురువు ఆశావహులు డీలా పడిపోయారు. తమకు కాదని కొత్తగా వచ్చిన పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

అదే విధంగా చూస్తే కడప జిల్లాలో కూడా అదే జరిగింది. టీడీపీలోకి జంప్ చేసిన రాం ప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి వరించింది. ఈ పదవి మీద ఆశ పెట్టుకున్న వారంతా షాక్ కి గురి అయ్యారు. ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో పదికి ఆరు ఎమ్మెల్యేలను టీడీపీ గెలుచుకుంది. దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత కడప అసెంబ్లీ సీటుని మాధవీ రెడ్డి గెలుచుకున్నారు. ఆమెకు మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఆశపడ్డారు. కానీ చివరికి అయిన వారికి ఆకులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది అన్న సణుగుడు టీడీపీ తమ్ముళ్ళలో వినిపిస్తోంది.

Tags:    

Similar News