భూమి మీద ఆక్సిజన్ అంతరిస్తుందా?.. శాస్త్రవేత్తల అభిప్రాయం ఇదే!
ఇలా 300 కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో కొద్ది మొత్తంలో ఆక్సిజన్ లభించడం మొదలయ్యింది.
భూమి మీద జీవులు బతకాలంటే ఆక్సిజన్ ఉండాల్సిందేనన్న సంగతి తెలిసిందే. కొద్ది క్షణాలపాటు ఆక్సిజన్ అందలేదని ఊహించుకోండి.. ఎంత భయంకరంగా ఉంటుందో కదా. కోవిడ్ టైమ్ లో ఆక్సిజన్ అందక కొన్ని లక్షల మంది పిట్టల్లా రాలిపోయారు. అసలు ఆక్సిజన్ లేని భూమిని ఊహించుకోండి.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 100 కోట్ల ఏళ్ల తర్వాత భూమి మీద ఆక్సిజన్ లేకుండా పోతోందని అంటున్నారు.
వాస్తవానికి కోటాది కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఆక్సిజన్ లేదు. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూగోళం ఏర్పడింది. ఇది జరిగిన మరో 100 కోట్ల ఏళ్లకు ఏకకణ జీవితో జీవం ఆవిర్భవించింది. ఆ కాలంలో ప్రోక్లొరోకాకస్ అనే బ్యాక్టీరియా తాను జీవించడానికి నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరిపించి అవసరమైన శక్తిని పొందేది. సముద్రంలో ఉండే ప్రోక్లొరోకాకస్ నిర్వహించిన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేది. ఇది వాతావరణంలో కలవడం ప్రారంభమైంది కూడా అప్పుడే.
ఇలా 300 కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో కొద్ది మొత్తంలో ఆక్సిజన్ లభించడం మొదలయ్యింది. అలా మొదలైన ఆక్సిజన్ ఇప్పటికి భూవాతావరణంలో 21 శాతానికి పెరిగింది. కాగా భూ వాతావరణంలో అత్యధికంగా నైట్రోజన్ 78 శాతం ఉంది. ఇక కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులన్నీ కలిపి ఒక్క శాతం ఉన్నాయి.
భూమ్మీద లభిస్తున్న ఆక్సిజన్ ను కిరణజన్య సంయోగక్రియ సృష్టించిందే. అయితే సగం సముద్రంలో కూడా ఆక్సిజన్ పుడుతోంది. సముద్రంలో ఉండే మొక్కలు, నాచు వంటివి కూడా తమకు కావలసిన శక్తి కోసం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసుకుంటున్నాయి. వీటి మాదిరిగానే ప్రోక్లోరొకాకస్ బ్యాక్టీరియా కూడా ఆక్సిజన్ ను సృష్టిస్తోంది.
మానవులు సగటున ఏడాదికి 9.5 టన్నుల గాలిని పీల్చుకుంటారు. అయితే ఇందులో ఆక్సిజన్ 21 శాతమే ఉంటుంది. మనం పీల్చుకునే ఆక్సిజన్‌లో కూడా మూడోవంతు మాత్రమే శరీరం ఉపయోగించుకుంటుంది. మిగతాది గాలిలోకి వదిలేస్తుంది. ఈ లెక్కన మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్‌ను వాడుకుంటాడు.
అయితే ఆక్సిజన్ భూమ్మీద శాశ్వతంగా ఉంటుందా అన్నది సందేహాస్పదమేనంటున్నారు.. శాస్త్రవేత్తలు. ఒకప్పుడు భూమిపై ఆక్సిజన్ లేదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చునన్నది వారు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలోని నాసాకు చెందిన కజుమి ఒజాకి, క్రిస్టఫర్ రైన్ హర్ట్ అనే శాస్త్రవేత్తలు.. ఓ ప్రయోగం ద్వారా ఇంకో వంద కోట్ల సంవత్సరాల తరువాత భూమ్మీద ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుందని చెబుతున్నారు. వంద కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు మరింత వేడిగా మారడం వల్ల భూమిపై కార్బన్ డైఆక్సైడ్ స్థాయి విపరీతంగా పెరిగిపోతుందని.. తద్వారా ఆక్సిజన్ వెళ్లిపోయేలా చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.