ఏపీలో ఎన్నికలు.. ప్యాకేజీల గోల తెలుసా..?
దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలకు జరిగినా.. పార్టీలు, నాయకుల కన్నా కూడా.. సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.
దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలకు జరిగినా.. పార్టీలు, నాయకుల కన్నా కూడా.. సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎన్నికలు అనగానే.. చిన్న చిన్న యూట్యూబ్ ఛానెళ్లు కూడా పుట్టుకొస్తాయి. ఇవి అప్పటికే పరిమితం. సర్వేలు.. ఇంటర్వ్యూలు అంటూ.. హడావుడి చేస్తాయి. ఇక, ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఏకంగా 250 యూట్యూబ్ చానెళ్లు పుట్టుకొచ్చాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున చానెల్ రావడం గమనార్హం.
అయితే.. వీటికి ప్యాకేజీలు కూడా భారీగానే ఉంటాయి. ఆయా నేతలకు ఈ చానెళ్లు ఆఫర్లు ఇస్తుంటాయి. ఇలా.. కేవలం 100 కోట్ల రూపాయలు కర్ణాటక నేతలు.. ఈ చానెళ్లకు సమర్పించుకున్నట్టు సర్వేలు వెల్లడించాయి. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ.. కొత్త చానెళ్లు పుట్టుకొచ్చాయి. వీటికి ఎలాంటి లైసెన్సు ఉండదు. అయినా.. కూడా చలామణి అయిపోతున్నాయి. ఇవి.. పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ఏపీలో ఇప్పుడు 150 చానెళ్లు వరకు ఉన్నాయని చెబుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఇన్ని చానెళ్లు.. ఉండగా ఎన్నికలకు రెండు మూడు మాసాల ముందు వీటి సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు పరిశీలకులు. ఇవన్నీ కూడా.. పార్టీ నేతలకు ఇప్పటికే ఆఫర్లు ప్రకటించాయని అంటున్నారు. నియోజకవర్గంలో స్టేటస్ రిపోర్టు, నియోజకవర్గంలో ప్రజల నాడి, సర్వే, ముందస్తు పోల్ రిజల్ట్ ఇలా.. కొన్ని విభాగాలుగా విభజించి మరీ ప్యాకేజీలు పెడుతున్నాయి.
ఈ ప్యాకేజీల గోల ఎక్కువగా ఉందని నియోజకవర్గాల్లో నాయకులు చెబుతున్నారు. అయితే.. ఎవరినీ ఏమీ విమర్శించలేని పరిస్థితి. ఎందుకంటే.. తామేమైనా అంటే.. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని వీరు భావిస్తున్నారు. దీంతో ప్యాకేజీల విషయంపై ఎలా స్పందించాలనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.