పద్మ పురస్కారాల్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రా వెనుకే!

పద్మ పురస్కారాల్లో మాత్రం ఏపీతో పోల్చినప్పుడు తెలంగాణ అందుకోనంత ఎత్తులో ఉందని మాత్రం చెప్పక తప్పదు.

Update: 2024-01-26 04:55 GMT

గణతంత్ర దినోత్సవ వేళ.. పద్మపురస్కారాల్ని కేంద్రం ప్రకటించటం తెలిసిందే. మోడీ ప్రధానమంత్రి అయ్యాక.. ఆయన హయాంలో చోటు చేసుకున్న మార్పు.. ఎక్కడో మారుమూల.. తాము నమ్మిన రంగాల్లో అత్యున్నత సేవలు అందించే వారిని వెతికి పట్టుకొని.. గుర్తించి పద్మ పురస్కారాల్ని అందించే సంప్రదయానికి తెర తీశారు. పెద్దగా ప్రచారం పొందని వారికి పద్మ పురస్కారాలతో సత్కరించే మంచి విధానాన్ని ఈసారి కొనసాగించినట్లుగా చెప్పాలి. ఈ క్రమంలో ఈసారీ పద్మ పురస్కారాల జాబితా విడుదలైనంతనే.. చాలామందికి తెలియని కొత్త పేర్లు కనిపించటం కనిపించాయి.

పద్మ పురస్కారాల ప్రకటన నేపథ్యంలో ఒక పోలిక తెర మీదకు వచ్చింది. ఇప్పటివరకు వెల్లడైన పద్మ పురస్కారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఎక్కువగా లభించాయన్న విషయానికి వెళితే.. ఆసక్తికర కోణం కనిపిస్తుంది. పద్మ పురస్కారాల్లో ఏపీతో పోలిస్తే తెలంగాణ ఎంతో ముందు ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఏపీకి రెండు పద్మవిభూషణ్ లతో పాటు ఒక పద్మ శ్రీ లభించాయి. అదే సమయంలో తెలంగాణకు ఐదు పద్మశ్రీలు లభించాయి. ఇందులో కళా రంగానిిక చెందిన ఎ.వేలు, ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, సాహిత్యం-విద్యా రంగం నుంచి కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యలు ఉన్నారు.

తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్ని లెక్కలోకి తీసుకుంటే.. ఇప్పటివరకు ఆంద్రప్రదేశ్ కు చెందిన 103 మందికి పద్మ పురస్కారాలు రాగా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 168 మంది ఉండటం విశేషం. తాజా అవార్డులతో కలిపి ఏపీకి చెందిన 8 మందికి పద్మవిభూషణ్.. 25 మందికి పద్మభూషణ్.. 70 మందికి పద్మశ్రీలు లభించాయి. తెలంగాణ విషయానికి వస్తే 14 మందికి పద్మవిభూషణ్.. 34 మందికి పద్మభూషణ్ .. 120 మందికి పద్మశ్రీలు లభించాయి. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. పద్మ పురస్కారాల్లో మాత్రం ఏపీతో పోల్చినప్పుడు తెలంగాణ అందుకోనంత ఎత్తులో ఉందని మాత్రం చెప్పక తప్పదు.





 


Tags:    

Similar News