పవన్ మీద ముద్రగడ కోపం ఏనాటిదో...!?
రానున్న ఎన్నికల్లో ముద్రగడ వైసీపీని వేదికగా చేసుకుని పవన్ మీద శరసంధానం చేస్తారు అని అంటున్నారు.
ముద్రగడ పద్మనాభం రాజకీయ నేత అయినప్పటికీ ఆత్మాభిమానానికి పెద్ద పీట వేస్తారు. అందుకే ఆయన మంత్రి పదవులు కూడా ఎన్నో సార్లు వలచి వచ్చినా వద్దు అనేసుకున్నారు. ఎందరో ఉద్ధండులతో పోరాడారు. చంద్రబాబుతో సరిసమానంగా 1978 నుంచి రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యేగా ఉన్న ముద్రగడ ఈ పాటికి ఏ ఉన్నత పదవులనో అందుకునేవారు. కానీ ఆయన పట్టుదల కల మనిషి ఎక్కడా రాజీ పడనే పడరు.
అందుకే ఆయన రాజకీయం కూడా రాజీలేకుండానే ఉంటుంది. గతాన్ని బాగా గుర్తు పెట్టుకుని తనను మాటలు అన్న వారినీ ఇంకా గుర్తు పెట్టుకుంటారు అని అంటారు పవన్ విషయంలో కూడా ముద్రగడ కోపం ఈనాటిది కాదు అది ఆనాటిది అని అంటున్నారు.
అదెలా అంటే 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ముద్రగడ చంద్రబాబు మీద సమరభేరీ మోగించినపుడు అత్యంత శక్తివంతమైన నాయకుడుగా చంద్రబాబు నాడు ఉన్నారు. ముద్రగడను ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని ఆయన అనుచరులు చెబుతారు.
ఏకంగా కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేయించారు అని అంటారు. ఇలా ఇన్ని విధాలుగా ముద్రగడను ఇబ్బంది పెడుతున్నపుడు అదే టీడీపీకి మద్దతుగా నిలిచి గెలిపించిన పవన్ ఒక్క మాట చంద్రబాబుని అంటే ముద్రగడకు ఈ బాధలు ఉండేవా అన్న సందేహం ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆయనతో పాటు వెనక ఉన్న వారికీ ఉంది.
కానీ పవన్ మాత్రం కాపు ఉద్యమ సమయంలో కానీ ముద్రగడను నానా రకాలైన ఇబ్బందులు పెడుతున్న నేపధ్యంలో కానీ పెదవి విప్పలేదు అని ముద్రగడ అభిమానులు అంటారు. ఇక ఇపుడు అదే మాటను ఓపెన్ గా ముద్రగడ అనేశారు ఆయన వైసీపీ లో చేరి వచ్చిన తరువాత తన సొంత నివాసం కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ పవన్ మీద ఫుల్ గా ఫైర్ అయ్యారు.
ఆనాడు తనను బాబు టార్గెట్ చేసినపుడు పవన్ ఎక్కడ ఉన్నారు అని సూటిగానే నిలదీశారు. ఈ ప్రశ్న ఇపుడు ముద్రగడ వేయడం వెనక కూడా వ్యూహం ఉంది. కాపుల కొసం తాను ఆందోళన చేస్తే కాపు పెద్దగా తాను ఉంటే తన ఊసే పట్టించుకోని పవన్ కి కాపులు ఎలా అండగా ఉండాలి ఎందుకు ఓటు వేయాలి అన్న ప్రశ్నలు ఆ సామాజిక వర్గంలో రేకెత్తించడానికే ముద్రగడ ఇలా మీడియా ముఖంగా పవన్ ని నిలదీశారు అని అనుకోవాలి.
అంతే కాదు, కాపు జాతిని మొత్తానికి చంద్రబాబు అవమానం చేసినపుడు పవన్ ఏ మూల ఉన్నారు అని కూడా ప్రశ్నించారు. దీనిని బట్టి రేపటి రోజున పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం కచ్చితంగా పవన్ కి ఎదురు నిలిచి వైసీపీ పక్షాన ఇవే ప్రశ్నలు సంధిస్తారు అని భావించవచ్చు అని అంటున్నారు.
పవన్ కి రాజకీయాల మీద కనీస అవగాహన లేదని ముద్రగడ మండిపడ్డారు. అంతే కాదు ఆయన సినిమా హీరో తప్ప మరేమీ తెలియదు అని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్ కి ముద్రగడ తన ఆగ్రహం ఏంటో జస్ట్ శాంపిల్ గా చూపించారు అని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో ముద్రగడ వైసీపీని వేదికగా చేసుకుని పవన్ మీద శరసంధానం చేస్తారు అని అంటున్నారు. అది వైసీపీకి లాభించేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు కూడా సంతోషిస్తున్నారు.