ఐదేళ్ల ప్రేమ పోరాటం ఫలించింది.. పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి

ఐదేళ్ల వారి ప్రేమను కాలపరీక్షను ఎదుర్కోవటమే కాదు.. చివరకు దేశాల సరిహద్దులు దాటి ఒక్కటయ్యేలా చేసింది.

Update: 2023-12-06 04:12 GMT

సినిమాటిక్ లవ్ స్టోరీ. ప్రేమలో పడటం తేలికే. దాన్నిఒక కొలిక్కి తీసుకురావటం అంత తేలికైన విషయం కాదు. అందునా భారత్ కుర్రాడు.. పాకిస్థాన్ అమ్మాయి మధ్య ప్రేమ అంటే మాటలా? ఐదేళ్ల వారి ప్రేమను కాలపరీక్షను ఎదుర్కోవటమే కాదు.. చివరకు దేశాల సరిహద్దులు దాటి ఒక్కటయ్యేలా చేసింది. వీరి క్యూట్ లవ్ స్టోరీలోకి వెళితే..

కోల్ కతాకు చెందిన సమీర్ ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. ఐదేళ్ల క్రితం భారత్ కు వచ్చిన వేళలో.. తన తల్లి ఫోన్ లో పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన జావెరియా ఖాన్ ను చూసినంతనే మనసు పారేసుకున్నాడు. పెళ్లి అనేది చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇరు వర్గాలకు చెందిన పెద్దలు ఓకే చేసినా.. వారి పెళ్లికి బోలెడు సమస్యలు ఎదురయ్యాయి. చివరకు వీసా కూడా రాని పరిస్థితి.

ఇదంతా ఒకఎత్తు అయితే కరోనా వీరి ప్రేమకు పెద్ద పరీక్షగా నిలిచింది. భారత్కు వచ్చేందుకు జావెరియా రెండుసార్లు ప్రయత్నించినా.. ఆమె వీసా రిజెక్టు అయ్యింది. మధ్యలో కొవిడ్. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా.. వీరిద్దరు తమ ప్రేమను సక్సెస్ చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది. జావెరియాకు భారత్ లో 45 రోజుల పాటు ఉండేందుకు వీలుగా వీసాను మంజూరు చేశారు.

దీంతో.. ఆమె వాఘా అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్ సరిహద్దుల్లోకి అడుగు పెట్టింది. ఏళ్లకు ఏళ్లుగా తన ప్రేమికురాలి కోసం ఎదురుచూస్తున్న సమీర్ ఖాన్ కుటుంబం ఆమెకు ఘన స్వాగతం పలికారు. భాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికింది. జావెరియాకు వీసాను మంజూరు చేసిన భారత ప్రభుత్వానికి సమీర్ ఖాన్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. వీరి లవ్ స్టోరీ పలువురిని ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News