పాకిస్థాన్ లో కారు కదలడం లేదు... కారణం ఇదే!
అవును... ప్రతి నెలా మంచి అమ్మకాలతో ఆటోమొబైల్ మార్కెట్ ఇండియాలో దూసుకుపోతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం బాగా క్షీణించింది
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్ధిక ఇబ్బందులో కొట్టుమిట్టాడుతుందని.. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు చాలా దారుణంగా పడిపోయాయని.. కరెన్సీ తరుగుదల.. పన్నుల్లో పెరుగుదల భారీగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్ తాజా పరిస్థితికి అద్ధంపట్టేలా పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (పీఏఎంఏ) గణాంకాలు తెరపైకి వచ్చాయి. ఈ లెక్కల్లో భారత్ లో సగం రోజుల్లో అమ్మకాలను పాక్ నెలరోజుల్లో చేరుకోలేకపోవడం గమనార్హం!
అవును... ప్రతి నెలా మంచి అమ్మకాలతో ఆటోమొబైల్ మార్కెట్ ఇండియాలో దూసుకుపోతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం బాగా క్షీణించింది. ఇందులో భాగంగా నవంబర్ నెలలో పాక్ లో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని పీఏఎంఏ వెల్లడించింది. దీంతో అక్కడ కార్ల అమ్మకాలు ఈ స్థాయిలో భారీగా పడిపోవడానికి గలకారణాలపై చర్చ మొదలైంది. తగ్గడం అంటే... మరీ దారుణంగా పడిపోవడం వారి ఆ దేశ ఆర్థిక పరిస్థితికి అద్ధం పడుందని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం గత నెలలో పాక్ లో కేవలం 4875 కార్లు అమ్ముడైనట్లు తెలుస్తుంది. అయితే... గత ఏడాది ఇదే నెలలో అక్కడి అమ్మకాలు 15,432 కావడం గమనార్హం. దీనిపై స్పందించిన పరిశీలకులు... నిత్యావసర వస్తువులే కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ దేశ ప్రజలకు కార్ల కొనుగోలు అసాధ్యం అని చెబుతున్నారు!
ఈ కారణంగానే ఈ ఏడాది పాకిస్తాన్ లో ఆటోమొబైల్ మార్కెట్ దారుణంగా క్షీణించింది. ఇందులో భాగంగా... పాక్ సుజుకి 72 శాతం, ఇండస్ మోటార్ 71 శాతం, హోండా అట్లాస్ కార్ 49 శాతం క్షీణించాయి. ప్రధాన వాహన తయారీదారుల అమ్మకాలే ఇలా ఉండటంతో... మిగిలిన పలు సంస్థలు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసి ప్లాంట్స్ కూడా మూసివేసాయి.
భారత్ లో పూర్తి భిన్నంగా అమ్మకాలు!:
పాకిస్థాన్ లో కార్ల అమ్మకాల పరిస్థితి అలా ఉంటే... భారత్ లో కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్లో మారుతి సుజుకి ఇండియా సేల్స్ 1,64,439.. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 17,818 యూనిట్లుగా నమోదవ్వగా... దేశంలో జరిగిన మొత్తం కార్ల అమ్మకాలు సంఖ్య 3.60 లక్షల కంటే ఎక్కువగా ఉంది.
అంటే... పాకిస్తాన్ లో అమ్ముడైన కార్ల సంఖ్య.. భారతదేశంలో సగం రోజులో అమ్ముడైన కార్ల సంఖ్య కంటే తక్కువని తెలుస్తోంది! ఇదే సమయంలో... "ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్" గణాంకాల ప్రకారం నవంబర్ లో భారత్ లో టూవీలర్ అమ్మకాలు కూడా గణనీయంగా సుమారు 21 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.