కీలక నగరాన్ని పాకిస్థాన్‌ కు ఎందుకు వదిలిపెట్టారు?

అయితే కొన్ని ప్రాంతాల్లో హిందూ–ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉండటంతో విభజనలో ఇబ్బందులు తలెత్తాయి.

Update: 2023-09-17 02:45 GMT

1947 ఆగస్టు 15న భారత్‌ కు, అదే ఏడాది ఆగస్టు 14న పాకిస్థాన్‌ కు స్వాతంత్య్రం వచ్చిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖగా రాడ్‌ క్లిఫ్‌ రేఖ ఉంది. అయితే దేశ విభజనకు ముందే ఇండియాను మత ప్రాతిపదికన విభజించడానికి బ్రిటిష్‌ పాలకులు కుట్రపన్నారు. మహ్మద్‌ అలీ జిన్నా అందులో చిక్కుకోవడంతో మత ప్రాతిపదికన దేశాన్ని విడదీయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీంతో ఇష్టం లేకున్నా అతికష్టం మీద మహాత్మా గాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ తదితరులు అంగీకరించాల్సి వచ్చింది.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే అంటే 1947, ఆగష్టు 3న అప్పటి ఇండియాకు గవర్నర్‌ జనరల్‌ గా ఉన్న లార్డ్‌ మౌంట్‌ బాటన్‌.. భారతదేశం స్వతంత్ర దేశం కానున్నదని తెలిపాడు. అలాగే దేశం రెండు భాగాలుగా విడిపోతుందని వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్లాన్‌ ను కూడా ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్లాన్‌ కు జవహర్‌ లాల్‌ నెహ్రూ, మహ్మద్‌ అలీ జిన్నా అంగీకారం తెలిపారు.

ఈ నేపథ్యంలో దేశ విభజన ఖాయం కావడంతో దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుని దేశంలో ఏ భాగాన్ని పాకిస్థాన్‌ గా విడదీయాలనేదానిపై అనేక చర్చోపచర్చలు, మీనమేషాలు సాగాయి. నేతలంతా అనేక తర్జనభర్జనలు పడ్డారు. చివరకు మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ పశ్చిమ వాయవ్య భాగంలో ముస్లింల జనాభా ఎక్కువ ఉండటంతో ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ కు విభజించారు. ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్నవరకు ప్రాంతాలన్నింటిని ఆ దేశానికి అప్పగించారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో హిందూ–ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉండటంతో విభజనలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ విభజన బాధ్యతను న్యాయవాది అయిన సిరిల్‌ రాడ్‌ క్లిఫ్‌ కు అప్పగించింది. అయితే అప్పటికి ఆయనకు భారతదేశం గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆయన ఒక్కసారి కూడా భారత్‌ లో పర్యటించలేదు.

బ్రిటిష్‌ ప్రభుత్వం దేశ విభజన బాధ్యతలను అప్పగించిన సిరిల్‌ రాడ్‌ క్లిఫ్‌ బ్రిటన్‌ లోని వేల్స్‌ లో నివాసం ఉండేవారు. ఆయన తండ్రి ఆర్మీ కెప్టెన్‌. ప్రముఖ విశ్వవిద్యాలయం ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివిన రాడ్‌ క్లిఫ్‌ లాయర్‌ గా నిలదొక్కుకున్నాడు. ప్రముఖ కేసులను వాదించి మంచి లాయర్‌ గా పేరు తెచ్చుకున్నాడు. దేశంలోనే పేరున్న లాయర్‌ గా ఖ్యాతి గడించాడు.

ఈ క్రమంలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన 1939–1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రాడ్‌ క్లిఫ్‌ ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖలో చేరాడు. 1941లో సమాచార శాఖకు డైరెక్టర్‌ జనరల్‌ అయ్యాడు.

భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపాక భారతదేశం– పాకిస్తాన్‌ మధ్య సరిహద్దు రేఖను గీసే బాధ్యతను సిరిల్‌ రాడ్‌ క్లిఫ్‌ కు ప్రభుత్వం అప్పగించింది. 5 వారాల్లో విభజన రేఖను గీయాలని ఆయనకు గడువు నిర్దేశించింది. ఈ క్రతువులో ఆయనకు ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లిం లాయర్లు సహాయం చేశారు.

ఈ నేపథ్యంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చే ముందు 1947, జూలై 8 న సిరిల్‌ రాడ్‌ క్లిఫ్‌ ఇండియాకు వచ్చాడు. అప్పటికి దేశంలో జనాభా అత్యధికంగా బెంగాల్, పంజాబ్‌ లను విభజించడం అంత సులువు కాలేదు. రెండు చోట్లా హిందూ–ముస్లిం జనాభా సమానంగా ఉంది.

ఇలా అన్ని ఇబ్బందులను ఎదుర్కొని, సవాళ్లను ఎదుర్కొంటూ రాడ్‌ క్లిఫ్‌ రెండు దేశాలకు సరిహద్దు రేఖను గీశాడు. తద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వం తనకు నిర్దేశించిన గడువు ఐదు వారాల్లోగానే పనిని పూర్తి చేశాడు. ఈ విభజన రేఖను 1947, ఆగస్టు 17న అధికారికంగా ప్రకటించారు. భారత్‌ – పాకిస్థాన్‌ సరిహద్దు రేఖగా రాడ్‌ క్లిప్‌ లైను అమల్లోకి వచ్చింది.

అయితే హిందూ జనాభా ఎక్కువగా ఉన్న లాహోర్‌ ను పాకిస్తాన్‌ కు ఇస్తారా లేదా అనే దానిపై అనేక చర్చోపచర్చలు సాగాయి. అయితే ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో సిరిల్‌ రాడ్‌ క్లిఫ్‌ మాట్లాడుతూ.. విభజనకు సన్నాహక సమయంలో తాను లాహోర్‌ ను భారతదేశంలోనే చేర్చానని తెలిపారు. అయితే అప్పటికి పాకిస్తాన్‌ లో పెద్ద నగరం లేకపోవడంతోనే లాహోర్‌ ను పాకిస్తాన్‌ కు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు బాంబుపేల్చారు.

స్వాతంత్య్రం వచ్చిన రెండు రోజుల వరకూ కూడా లాహోర్‌ భారతదేశంలోనే భాగంగా ఉంది. తరువాత అధికారిక ప్రకటనతో అది పాకిస్తాన్‌ లో చేరిపోయింది. దేశ విభజన తర్వాత ఇండియా నుంచి ముస్లింలు ఆ దేశానికి.. ఆ దేశం నుంచి హిందువులు భారత్‌ కు తిరిగొచ్చేశారు. దేశానికి విభజన రేఖను గీసిన రాడ్‌ క్లిప్‌ కూడా బ్రిటన్‌ కు వెళ్లిపోయారు. మళ్లీ ఆయన ఇండియా వైపు తొంగి చూడలేదు. ఇలా 1947లో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న లాహోర్‌ విధి ఆడిన వింత నాటకంలో పాకిస్థాన్‌ లో కలిసిపోయింది.

Tags:    

Similar News