ఆ దేశంలో పాకిస్థానీ ఎయిర్ హోస్టెస్ ల మిస్సింగ్.. అసలు ఏం జరుగుతోంది?
ఉత్తర అమెరికా ఖండ దేశమైన కెనడా ఇటీవల కాలంలో భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిన విషయం తెలిసిందే
ఉత్తర అమెరికా ఖండ దేశమైన కెనడా ఇటీవల కాలంలో భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత రెండు దేశాల సంబంధాలు దిగజారాయి. హర్దీప్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
కాగా ఇప్పుడు కెనడాలోనే పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ హోస్టెస్ లు వరుసగా అదృశ్యం కావడం కలకలానికి దారితీస్తోంది. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు ఎయిర్ హోస్టెస్ లు మిస్ అవుతున్నారో తెలియడం లేదు. దీంతో ఈ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది.
గత నెలలో ఒక ఎయిర్ హోస్టెస్ కనిపించకుండా పోగా.. తాజాగా మరో విమాన మహిళా సిబ్బంది అదృశ్యమయ్యారు. ఇలా గత ఏడాది నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది ఎయిర్ హోస్టెస్ లు కెనడాలో మాయమవడం తీవ్ర కలకలం రేపుతోంది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన పాకిస్థాన్ ఎయిర్ లైన్ విమానం.. పీకే–782లో మరియం రజా అనే ఎయిర్ హోస్టస్ ఉన్నారు. కెనడాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన టొరంటోలో దిగిన మరియం రజా.. మరుసటి రోజు కరాచీ రావాల్సిన విమానంలో విధులకు రాలేదు. దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు. అక్కడ మరియం రజా యూనిఫామ్ తోపాటు ‘థ్యాంక్యూ పీఐఏ’ అని రాసి ఉన్న ఓ లేఖను గుర్తించారు. పీఐఏ అంటే... పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్. మరియం రజా గత పదిహేనేళ్లుగా ఇందులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పీఐఏ అధికార ప్రతినిధి ప్రకారం.. తమ సిబ్బంది టొరంటోలో అదృశ్యం కావడం ఈ ఏడాది ఇది రెండో ఘటన అని చెబుతున్నారు.
కాగా కెనడాకు వచ్చిన పాకిస్థానీ ఎయిర్ హోస్టెస్ లు ఇలా మాయం కావడం 2019 నుంచే జరుగుతోందట. ఇటీవల సంవత్సరాల్లో ఈ అదృశ్యం కేసులు మరిన్ని పెరిగాయని తెలుస్తోంది. గత ఏడాది ఏడుగురు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సిబ్బంది కెనడాలో కనిపించకుండా పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అయితే, ఇలా అదృశ్యమవుతున్న సిబ్బంది కెనడాలో ఆశ్రయం పొందుతున్నట్లు పాకిస్థానీ ఎయిర్ లైన్స్ నమ్ముతోంది. కొన్నేళ్ల క్రితం డ్యూటీలో ఉన్న ఓ విమానయాన ఉద్యోగి ఇలాగే పారిపోయి కెనడాలో స్థిరపడ్డారని అంటున్నారు. అనంతరం అనేకమందికి ఆ ఉద్యోగి సలహా ఇవ్వడంతో మిగతావారు కూడా అదే బాట çపట్టినట్టు పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అధికారి ఒకరు చెప్పారు.
అమెరికాతో పోలిస్తే కెనడాలో సులువుగానే పౌరసత్వం పొందే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో పాకిస్థాన్ విమానాల్లో పనిచేస్తున్న సిబ్బంది కెనడాకు రాగానే మాయమవుతున్నారని.. మళ్లీ తిరుగు ప్రయాణంలో విధులకు రావడం లేదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు.
అయితే సిబ్బందికి తక్కువ వేతనాలు, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ పై నెలకొన్న భయంతోనే కెనడా చేరుకున్న అనంతరం విమాన సిబ్బంది అదృశ్యమవుతున్నారని చెబుతున్నారు.