పీవోకేపై కోర్టులోనే నిజం కక్కేసిన పాక్ లాయర్.. అవాక్కయిన న్యాయమూర్తి

స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచే కశ్మీర్ పై కుతంత్రానికి తెరతీసింది పాకిస్థాన్.

Update: 2024-06-01 11:00 GMT

స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచే కశ్మీర్ పై కుతంత్రానికి తెరతీసింది పాకిస్థాన్. అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ కాస్త ఆలస్యంగా స్పందించడంతో ఇప్పటికీ ఆ రాష్ట్రం పర్యవసానాలు ఎదుర్కొంటోంది. శత్రు దేశం కుట్రలతో వేలాది మంది భారత వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయాలపాలయ్యారు. ఇక కశ్మీర్ ను 1948లోనే కొంత భాగం ఆక్రమించిన పాకిస్థాన్.. దానికి ఆజాద్ కశ్మీర్ గా పేరు పెట్టింది. భారత్ ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పిలుస్తోంది. ఇటీవలి ఎన్నికల సందర్భంగానూ బీజేపీ నాయకులు పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటు చేయడం గమనార్హం.

అక్కడంతా అశాంతి.. అల్లర్లు..

పీవోకేలో రెండు ప్రధాన ప్రాంతాలు ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్థాన్. ఇటీవలి బాల్టిస్థాన్ లో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. కరెంటు చార్జీల తగ్గింపు, గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలంటూ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ ఆందోళనలకు దిగింది. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు ఓ దశలో ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో.. ప్రజలు రాళ్లతో ప్రతి దాడికి దిగారు. కొండ ప్రాంతాలు, ఘాట్‌ వద్ద పోలీసులపై తిరగబడ్డారు. మూకదాడులు చేశారు. ఓ ఎస్సై మృతిచెందాడు. తమపై పాకిస్థాన్ వివక్ష చూపుతోందంటూ కొన్నేళ్లుగా జాక్‌ ఆందోళనలు చేస్తోంది. 1967లో జీలం నదిపై మంగ్లా డ్యామ్‌ కట్టారు. 1,400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 300 మెగావాట్లను స్థానికులకు కేటాయించాలి. 1975 నాటికే డ్యామ్‌ నిర్మాణ ఖర్చులు వెనక్కి వచ్చాయి. అయినా.. విద్యుత్తును పంజాబ్‌ కు తీసుకెళ్తోంది. గోధుమ పిండి, కరెంటు చార్జీలపై తొలుత బంద్‌ కు పిలుపునిచ్చింది. అనంతరం చలో పీవోకే రాజధాని ముజఫరాబాద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పీవోకే వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు.

అది విదేశీ భూభాగం..

ఇదిలా ఉండగా పీవోకే (పాక్ భాషలో ఆజాదీ కశ్మీర్) పై సాక్షాత్తు పాకిస్థాన్ ప్రభుత్వ న్యాయవాది ఒకరు నోరుజారారు. రాజధాని ఇస్లామాబాద్ హై కోర్టులో ఓ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పీవోకే విదేశీ భూభాగమని, అది పాక్ లో అంతర్భాగం కాదని న్యాయవాది వ్యాఖ్యానించాడు. అయితే, దీనిపై కోర్టు సైతం ఆశ్చర్యపోయింది. అలాగైతే.. మరి ఆ ప్రాంతంలో సైన్యాన్ని ఎందుకు ఉంచారంటూ ప్రశ్నించింది. పీవోకేలో సైన్యానికి అధికారాలు ఉండగా.. కోర్టులకు లేవా? అని నిలదీశారు.

Tags:    

Similar News