ఇవేం మాటలు పల్లా? పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కుక్కలా?
సాదాసీదా జనాల నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు చూపే ప్రభావానికి.. కీలకస్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలకు తేడా ఉంటుంది
ఏదో చేయబోతే మరేదో అయినట్లుగా.. కొన్నిసార్లు ఏదో చెప్పాలన్న అత్యుత్సాహంతో మరేదో చెప్పటం.. చివరకు అదో పెద్ద పంచాయితీ కావటం చూస్తుంటాం. సాదాసీదా జనాల నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు చూపే ప్రభావానికి.. కీలకస్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలకు తేడా ఉంటుంది. తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తమతో అన్నట్లుగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. షాకిచ్చేలా మారాయి.
జనగామ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న పల్లా.. అక్కడి నాయకులు.. కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించిన ప్రశ్నల గురించి వివరిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారని తాను ప్రశ్నించినట్లుగా పల్లా చెప్పారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉంటే.. కుక్కల్లా మాట్లాడుతుంటారని.. ఆ కుక్కల్ని తమవైపుకు తిప్పుకుంటే పిల్లుల్లా మారిపోతారని తనతో అన్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో.. పల్లా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కీలకమైన ఎన్నికల వేళ.. అధినేతను ఇరుకున పెట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారతాయని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరికి టికెట్లను కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వేళ.. ఈ తరహా వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా సరైన ఎత్తుగడ కాదన్న మాట వినిపిస్తోంది.