కోడి పందేలు షురూ.. ఎమ్మెల్యే ప్రారంభించేశారు!
చిత్రం ఏంటంటే.. కోడి పందేల నిర్వహణలో రాజకీయాలకు పాత్ర తక్కువ. అంటే.. ఎవరూ ఎవరిపైనా నిందలు వేసుకోరు. పైగా కలసి కట్టుగా అధికారులను కట్టడి చేస్తూ ఉంటారు.
ఏపీలో తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించే కోడి పందేలు నెల రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. అది కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వీటిని ప్రారంభించడం గమనార్హం. అయితే.. తాజాగా పల్నాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పందేలు నిర్వహించడం గమనార్హం. పల్నాటి వీర చరిత్రలో కీలక పాత్ర అయిన.. నాయకురాలు నాగమ్మ జ్ఞాపకార్థం చేపట్టిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి(మాచర్ల), వెనిగండ్ల రాము(గుడివాడ)లు.. కోళ్లను ఉసి గొల్పి పందేలకు శ్రీకారం చుట్టారు.
దీంతో పల్నాడు వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. దీనిని బట్టి.. ఇక, సంక్రాంతికి పందేల జోరు పెరిగిపోనుందన్న టాక్ వినిపిస్తుండడం గమనార్హం. వాస్తవానికి కోడి పందేలను నిషేధించాలన్న డిమాండ్ అయితే ఉంది. ప్రతి సంక్రాంతి సందర్భంగా హైకోర్టులో కేసులు నమోదు కావడం.. వీటిపై విచారణలు జరగడంతోనే సరిపోతోంది. దీనికి ప్రతిసారీ ఏ ప్రభుత్వం ఉన్నా.. కోడి పందేలు జరగనివ్వబోమని చెబుతున్నాయి. కానీ, అంతా షరా మామూలే. ఏటికేడు వేలాది కోట్లు ఈ పందేల్లో రక్తాలు కారుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో వస్తున్న పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందేలు కడుతున్నారు. దాదాపు 100 కోట్ల పైగానే ఈ కోడి పందేల బిజినెస్ జరుగుతుండడం గమనార్హం.
ఎవరి హయాంలో అయినా..
చిత్రం ఏంటంటే.. కోడి పందేల నిర్వహణలో రాజకీయాలకు పాత్ర తక్కువ. అంటే.. ఎవరూ ఎవరిపైనా నిందలు వేసుకోరు. పైగా కలసి కట్టుగా అధికారులను కట్టడి చేస్తూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నా.. వైసీపీ అధికారంలో ఉన్నా.. గత పదేళ్లలో నాయకులు అందరూ చేతులు కలిపి ఈ పందేలను నిర్వహించడం గమనార్హం. అత్యంత రాజకీయ సామరస్యం ఎక్కడైనా ఉందంటే.. అది సంక్రాంతి సమయంలో ముఖ్యంగా కోడి పందేల కోసమే కావడం విశేషం. ఎవరూ ఎవరినీ పట్టించే ప్రయత్నం చేయరు. అందరూ బరులు గీసుకుని ముందుగానే కేటాయించుకుంటారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే పశ్చిమ, తూర్పుగోదావరి, కాకినాడల్లో బరులు రెడీ అయ్యాయి. దీనిని బట్టి సంక్రాంతి సంబరాలు.. కోడి పందేలు యధావిధిగా సాగిపోనున్నాయన్నది సుస్పష్టం.