కుంభమేళాలో చచ్చిపోండి - ధనవంతులపై పప్పూయాదవ్ పరుష వ్యాఖ్యలు
కుంభమేళా తొక్కిసలాటపై లోక్ సభలో మాట్లాడుతూ పప్పూ యాదవ్ సహనం కోల్పోయారు.
త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాపై బిహార్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ విరుచుకుపడ్డారు. ధనవంతులు అంతా మోక్షం కోసం కుంభమేళాకు వెళ్లి చచ్చిపోవాలని శాపనార్థాలు పెట్టారు. ఇటీవల కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై లోక్ సభలో మాట్లాడుతూ పప్పూ యాదవ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ పప్పూ యాదవ్ వివాదాస్పద రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. గతంలో పలు పార్టీల్లో పనిచేసిన ఆయన క్రిమినల్ కేసులతో సంబంధం ఉందన్న కారణంగా దాదాపు అన్ని పార్టీలు ఆయనను దూరం పెట్టాయి. అయితే గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన పప్పూ యాదవ్ తన సహజసిద్ధ ధోరణి మాత్రం మార్చుకోలేదని మరోసారి రుజువైంది.
కుంభమేళా తొక్కిసలాటపై లోక్ సభలో మాట్లాడుతూ పప్పూ యాదవ్ సహనం కోల్పోయారు. మహా కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, బాగా డబ్బున్నవారు అక్కడే చనిపోవాలని, అప్పుడే వారికి మోక్షం సిద్ధిస్తుందని వ్యాఖ్యానించారు. తొక్కిసలాట తర్వాత 300-600 మృతదేహాలను అక్కడి నుంచి తొలగించారని, మృతులకు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరగలేదని తెలిపారు. అయితే అక్కడ చనిపోయిన వారంతా మోక్షం పొందారని ఓ బాబా చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. చాలా మంది బాబాలు, రాజకీయ వేత్తలు, అధిక ధనవంతులు కూడా త్రివేణీ సంగమంలో మునిగి అక్కడే చచ్చిపోవాలి.. మోక్షం పొందాలి. అలాంటి బాబాలకు మోక్షం లభించాలి అని వ్యంగంగా స్పందించారు పప్పూయాదవ్.
కాగా, గత నెల 25న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే మృతుల సంఖ్యను దాచిపెడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో మాట్లాడిన సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మహా కుంభమేళా తొక్కిసలాటపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం తొక్కిసలాట మరణాలను దాస్తోందని ధ్వజమెత్తారు. కుంభమేళాలో భద్రత ఏర్పాట్లకు ఆర్మీని ఉపయోగించాలని సూచించారు. దీనిపై స్పందించిన బీజేపీ హేమమాలిని.. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శలను కొట్టిపడేశారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదని ఆమె వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది.