400 సీట్లు పోటీ చేయడంలేదు...375 ఎలా వస్తాయి...?

బీజేపీ పెద్దలు మాట్లాడితే ఈసారి బీజేపీకి 375 సీట్లు సొంతంగా వస్తాయని ప్రకటిస్తున్నారు. ఇది ధీమానానా లేక అతి విశ్వాసమా అన్నది అర్ధం కావడం లేదు అంటున్నారు

Update: 2024-04-04 01:30 GMT

బీజేపీ పెద్దలు మాట్లాడితే ఈసారి బీజేపీకి 375 సీట్లు సొంతంగా వస్తాయని ప్రకటిస్తున్నారు. ఇది ధీమానానా లేక అతి విశ్వాసమా అన్నది అర్ధం కావడం లేదు అంటున్నారు. ఎందుకంటే లాజిక్ మిస్ అయినట్లుగా ఇది ఉంది. బీజేపీ పోటీ చేసేది గట్టిగా 400 సీట్లు కూడా లేదు. మరి ఆ నంబర్ లో పోటీ చేయకపోతే అందులో నూటికి తొంబై అయిదు శాతం సీట్లు బీజేపీకి వస్తాయనుకున్నా అవి ఎలా వస్తాయి అన్నదే చర్చగా ఉంది.

అసలు ఇంతకీ బీజేపీకి సోలోగా 375 ఎన్డీయే కూటమితో 400 సీట్లు ఎందుకు కావాలంటే కనుక బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా కమలం పార్టీ మనసులో మాటను చెబుతున్నారు. బీజేపీ రాజ్యాంగ సవరణ చేస్తుంది అని. బీజేపీ సొంతంగా అధికారంలోకి రెండు సార్లు వచ్చింది. అది 2014, 2019లలో జరిగింది. మొదటి సారి బొటాబొటీ మెజారిటీ వస్తే రెండవసారి 300 పై చిలుకు ఎంపీలు బీజేపీకి సొంతంగా లభించాయి.

ఇపుడు బీజేపీ అత్యాశ పడుతోందో లేక అతి ధీమా పడుతోందో తెలియదు కానీ 375 సీట్లు బీజేపీ ఖాతాలో ఉండాలని అంటోంది. ఎన్డీయే మిత్రులతో కలుపుకుని నాలుగు వందలకు పైగా సీట్లు రావాలన్నది బీజేపీ పంతంగా ఉంది.

మరి ఎందుకు ఈ నంబర్ మీద బీజేపీకి మోజు ఉంది అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి సరిపోయే మెజారిటీ కాకుండా మరింత ఎక్కువ కావాలన్నది ఏకంగా రాజ్యాగాన్ని మార్చడం కోసం అని అంటున్నారు. బీజేపీ అజెండా అలా పెట్టుకుందని ఆయా పార్టీల నేతలు వివిధ సందర్భాలలో చెబుతున్న మాటలను బట్టి అర్ధం అవుతోంది.

రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి అన్నది ఇక్కడ ప్రశ్న. భారత రాజ్యాంగం కోసం భారీ కసరత్తు జరిగింది. దేశానికి 1947లో స్వాతంత్ర్యం లభించింది. దాని కంటే ముందే రాజ్యాంగ సభ ఏర్పాటు అయింది. అది కాస్తా మూడేళ్ల పాటు శ్రమించి ఎందరో మేధావులను పెట్టుకుని మరీ రచించింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి దేశంలో అమలు జరుగుతోంది.

ఇప్పటికి చూస్తే డెబ్బై అయిదు ఏళ్లు అయింది. రాజ్యాంగం పట్ల అన్ని వర్గాలు అన్ని జాతులు అంతా కూడా విధేయతతో ఉంటున్నారు. దానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటి అన్నది పెద్ద చర్చగానే ఉంది.

అయితే సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే బీజేపీకి దాని అనుబంధ మిత్ర పక్షాలకు 400 పై బడి మెజారిటీ వస్తే రాజ్య సభతో కలుపుకుని మొత్తం పార్లమెంట్ లో మూడు వంతులకు పైగా మెజారిటీ వస్తుంది.అపుడు ఏకంగా రాజ్యాంగాన్ని పూర్తిగా సవరించవచ్చు.

ఆ అవకాశం కోసమే బీజేపీ ఈ నంబర్ కోరుకుంటోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు ల లో మార్పులు  చేస్తారు అని సామాజిక మాధ్యమాలలో ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అదే విధంగా చూస్తె ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే రిజర్వేషన్ వర్తించేలా రాజ్యాంగాన్ని సవరిస్తారు అని మరో రకంగా ప్రచారం సాగుతోంది.

అసలు రాజ్యాంగం మార్చడం అవసరమా అన్న చర్చ కూడా ఉందిపుడు. బీజేపీకి మూడోసారి నాలుగు వందలకు పైగా సీట్లు ఇస్తే మాత్రం దేశంలో రాజ్యాంగ సవరణ జరుగుతుందని అంటున్నారు. ఈ ప్రచారంలో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ మేధావులు అయితే ఈ రకంగా ఎవరూ చేయకూడదు అని అంటున్నారు.

అయితే ఈ ప్రచారాన్ని చూసిన మీదట బీసీలు ఎస్సీలు, ఎస్టీలలో భయాలు మొదలయ్యాయని అంటున్నారు. గతంలో క్రిమిలేయర్ విధానాన్ని రిజర్వేషనల్లో తీసుకుని వచ్చారు. దాని మీదనే పెద్ద రచ్చ సాగింది. ఇపుడు ఒక కుటుంబానికి ఒక్కటే రిజర్వేషన్ అంటే అది ఏకంగా అగ్గి మంట గా మారే అవకాశం ఉంటుంది.

ఒక కుటుంబంలో ఒక తరంలో ఒకరికే రిజర్వేషన్ ఇస్తే ఆ కుటుంబంలోని మిగిలిన వారి సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కుటుంబం మొత్తానికి గత ఏడున్నర దశాబ్దాలలో రిజర్వేషన్లు ఇస్తేనే ఈ రోజుకీ ఇంకా బడుగులు బలహీన వర్గాలా జీవితాలలో ఎలాంటి మార్పు పెద్దగా రాలేదని, శతాబ్దాలుగా జరిగిన వెనుకబాటుతనానికి కొన్ని దశాబ్దాలలో జవాబు దొరకదని అంటున్నారు. దాని కోసం మరిన్ని దశాబ్దాల పాటు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అని అంటున్నారు.

ఇపుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. కాంగ్రెస్ నేతలు, వామపక్షాలు కూడా మూడవసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ సవరణ జరుగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇది కేవలం ప్రచారమా లేక నిజంగా బీజేపీ మనసులో ఉందా అన్నది అగ్ర నేతలు సమాధానం ఇచ్చి ఈ ప్రచారానికి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే మాత్రం ఇది ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు.

Tags:    

Similar News