టీడీపీలో పార్ధసారధి ముసలం...వైసీపీలోకి కీలక నేత...!

వైసీపీ కూడా తమ పార్టీ నేతలు టీడీపీలోకి పోతే చూస్తూ ఊరుకున్నది ఇందుకే. ఒకరు ఇటు నుంచి పోటే మరొకరు అటు నుంచి వస్తారు అని.

Update: 2024-02-20 03:47 GMT

రాజకీయాల్లో త్రాసు ఎపుడూ సమానంగా ఉంటుంది. అటూ ఇటూ నేతలు సమానంగానే ఉండాలి. ఇటు నుంచి ఒకరు అటు గెంతితే త్రాసు వంగిపోదు, అటు నుంచి ఇటు వైపు మరో నేత రావడంతో బ్యాలెన్స్ అవుతుంది. పాలిటిక్స్ లో ఎపుడూ ఇదే జరుగుతుంది. అయితే ఎత్తు బరువు అన్నీ సమానంగా పోయిన నేతకు వచ్చిన నేతకు మధ్య ఉన్నాయా అన్నదే ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తుంది.

వైసీపీ కూడా తమ పార్టీ నేతలు టీడీపీలోకి పోతే చూస్తూ ఊరుకున్నది ఇందుకే. ఒకరు ఇటు నుంచి పోటే మరొకరు అటు నుంచి వస్తారు అని. ఇది పొలిటికల్ న్యూటన్ ఫిలాసఫీ. సో ఇపుడు అదే జరుగుతోంది. వైసీపీలో టికెట్ దక్కని మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే అయిన వైసీపీ కీలక నేత పార్ధసారధి సైకిలెక్కేశారు. ఆయనకు మొదట పెనమలూరు అని చెప్పినా అక్కడ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ నుంచి వచ్చిన వత్తిడితో నూజివీడుకు షిఫ్ట్ చేశారు.

దాంతో నూజివీడు టీడీపీలో ముసలం మొదలైంది. అక్కడ ఇంచార్జిగా ఉంటూ 2024లో పోటీ చేద్దామని ఆశలు పెంచుకున ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు భారీ షాక్ తగిలింది. పార్ధసారధి తన పని మొదలెట్టేశారు. టీడీపీ పెద్దలతో తమ బాధ చెప్పుకున్నా ఎవరూ వినలేదు.

దాంతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలోకి వస్తున్నారు. ఆయన 2014లో టీడీపీ తరఫున పోటీ నూజివీడు నుంచి పోటీ చేస్తే 85 వేల ఓట్లు వచ్చాయి. 2019లో జగన్ వేవ్ లోనూ 84 వేల ఓట్ల దాకా తెచ్చుకున్నారు. బలమైన బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉందని వైసీపీ ఆయనకు చేర్చుకుంటోంది అని అంటున్నారు.

ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ కి రావడంతో ఇక చేరిక తరువాయి అని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినా తనకు టీడీపీలో గుర్తింపు లేదని ముద్దరబోయిన నిన్నటికి నిన్న తన అనుచరులు పార్టీ క్యాడర్ ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఇక తనకు ఎవరు దిక్కు అని వాపోయారు. పారాచూట్ నేతలకు చంద్రబాబు టికెట్ ఇస్తున్నారు అని కూడా విమర్శించారు.

ఇక ఇరవై నాలుగు గంటలు తిరగకముందే ఆయన వైసీపీలో చేరడానికి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను అంటున్న ముద్దరబోయినకు వైసీపీ నూజివీడు టికెట్ ఇస్తుందా అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే అక్కడ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఉన్నారు.

ఆయన వైసీపీ తరఫున 2014, 2019లలో రెండు సార్లు గెలిచిన బలమైన నేత. మరి ఆయనను కాదని ముద్దరబోయినకు టికెట్ ఇస్తారా లేక హామీ ఇచ్చి ఆయన బలాన్ని వాడుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పార్ధసారధి వచ్చి టీడీపీలో ముసలం పెట్టేశారు అని అంటున్నారు. ఇక టీడీపీ లిస్ట్ బయటకు వస్తే మరింత మంది తమ్ముళ్లు బయటకు వస్తారని పొత్తు చిక్కులతో జనసేన నేతలు కూడా తమతో కలుస్తారు అని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. మరి ఆ లిస్ట్ భారీగా ఉంటుందా లేదా అంటే వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News