టిక్కెట్ లేని వైసీపీ ఎమ్మెల్యే పాలిటిక్స్‌కు ప‌దునెక్కువే...!

ప‌ర్వ‌త పూర్ణ చంద్ర‌ప్ర‌సాద్‌. ఈ పేరు చెప్ప‌గానే స్ఫురించే నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని ప్ర‌త్తిపాడు

Update: 2024-01-15 02:45 GMT

ప‌ర్వ‌త పూర్ణ చంద్ర‌ప్ర‌సాద్‌. ఈ పేరు చెప్ప‌గానే స్ఫురించే నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని ప్ర‌త్తిపాడు. ప్ర‌స్తుతం కాకినాడ జిల్లాలో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌ను స‌ర్వేల ఆధారంగా ఇటీవ‌ల పార్టీ అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. అదేస‌మ‌యంలో 2014లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన వ‌రుపుల సుబ్బారావును ఇక్క‌డ ఇంచార్జ్‌గా నియ‌మించింది. అంటే.. దాదాపు సుబ్బారావుకే పార్టీ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. పైగా ఆయ‌నే అన్ని అధికారిక కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటున్నారు.

కానీ, ప‌ర్వ‌త మాత్రం.. త‌న ధాటిని కొన‌సాగిస్తూనే ఉన్నారు. ''ఇంచార్జ్ మార్పు స‌హ‌జం. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎవ‌రు ముదురో తేలుతుంది. అప్పుడు టికెట్ కేటాయింపు స‌హ‌జంగానే మారిపోతుంది. దీనిని ఎవ‌రూ మార్చ‌లేదు. టికెట్ నాకే ద‌క్కుతుంది'' అని ప‌ర్వ‌త ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో టికెట్ త‌న‌కు రాక‌పోతే.. వ‌రుపుల‌ను ఎలా ఓడించాల‌నే అంశంపైనా ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇదిలావుంటే, ఇంచార్జిని నియ‌మించ‌డం.. ముఖ్యంగా వ‌రుపుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ప‌ర్వ‌త‌కు ఏమాత్రం ఇష్టం లేదు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. ఐదేళ్లు నిబ‌ద్ధ‌త‌తో తాను ప‌నిచేశాన‌ని.. త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌ని త‌న కేడ‌ర్‌లో ధైర్యం నింపుతున్నారు. ఇదిలావుంటే.. ఈ నెల 12 నుంచి త‌న‌కంటూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు కూడా చేసేందుకు ప‌ర్వ‌త రెడీ అవుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ నెల నుంచి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు జ‌నంలోకి వెళ్లేందుకు ప్ర‌త్యేకంగా 'ప్ర‌జాదీవెన‌'కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. నేరుగా ఆయ‌న‌ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అంతేకాదు.. ఒక‌వేళ టికెట్ ఇవ్వ‌ని ప‌క్షంలో పార్టీ మార్పు దిశ‌గా కూడా ప‌ర్వ‌త ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు వ్యాఖ్యానిస్తున్నారు. ''ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏమైనా జ‌ర‌గొచ్చు. ఇక్క‌డ నుంచి మా నాయ‌కుడు పోటీ చేయ‌డం ఖాయం'' అని ప‌ర్వ‌త‌కు అత్యంత స‌న్నిహిత నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. మ‌రోవైపు.. వైసీపీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వరుపుల నాయ‌కుల‌ను క‌లుపుకొని పోతున్నారు. అధికారుల‌తోనూ స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నారు. అయితే.. ప‌ర్వ‌త దూకుడుతో ఇక్క‌డ ఏం జ‌రుగుతుందనేది ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News