తిరుపతి.. ఆసుపత్రిలో వైద్యురాలిపై రోగి దారుణ దాడి!
విధుల సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ.. వైద్యులు దేశవ్యాప్తంగా ఆందోళన చేసి రెండు రోజులు కూడా గడవకుండానే.
విధుల సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ.. వైద్యులు దేశవ్యాప్తంగా ఆందోళన చేసి రెండు రోజులు కూడా గడవకుండానే.. తాజాగా తిరుపతిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ ఉదంతంపై.. వైద్యులు ఆగ్రహంతో ఉన్నారు. సుప్రీంకోర్టు ఎంతో నచ్చజెప్పిన తర్వాత కానీ. వారు సాధారణ విధుల్లో చేరేందుకు అంగీకరించలేదు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా తిరుపతిలో ఓ జూనియర్ వైద్యురాలిపై ఓ రోగి దాడికి దిగడం గమనార్హం.
ఈ ఘటన ఈ నెల 25న జరగ్గా.. దీనికి సంబంధించిన వ్యవహారం మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిలో శ్రీవేంకటేశ్వ వైద్య శాలలో జనరల్ వార్డులో ఓ జూనియర్ వైద్యురాలు.. రోగులను పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో వార్డులో ఆమె కలియ దిరుగుతున్న సమయంలో ఓ రోగి వెనుక నుంచి రయ్యన దూసుకువచ్చి.. ఆమె జుట్టు పట్టుకుని బలంగా వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు. అయితే.. ఈ హఠాత్ పరిణామంతో వైద్యురాలు కొంత భీతిల్లారు. ఆ వెంటనే తనను తాను నియంత్రించుకున్నారు.
అయినప్పటికీ.. రోగి బలంగా గుంజడంతో ఆమె తల ఆసుపత్రిలోని ఐరన్ మంచానికి తగిలి స్వల్ప గాయ మైంది. ఇంతలోనే తోటి రోగులు, ఆసుపత్రి సిబ్బంది జోక్యం చేసుకుని రోగిని విడిపించడంతో వైద్యురా లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే..ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. తమకు రక్షణ కల్పించాలనివారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చిత్తూరు పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
దాడి చేసిన రోగి మానసిక స్థితి సరిగాలేదని ప్రాథమికంగా నిర్దారించారు. కాగా.. తమకు రక్షణలేని వైద్య శాలల్లో వైద్యం చేసేది లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వారంతా ధర్నాకు దిగారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రస్తుతానికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. వైద్యులు మాత్రం తమ ధర్నాను విరమించలేదు. ప్రభుత్వం ఎలాంటి నిర్నయం తీసుకుంటుందో చూడాలి.