కంపెనీ విలువ రూ.2.5 లక్షల కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 102 ఉద్యోగులే

ఆ కంపెనీ మార్కెట్ విలువ అక్షరాల రూ.2.5లక్షల కోట్లు. అంత భారీ కంపెనీలో ఉద్యోగులు ఎంతమంది ఉంటారని మిమ్మల్ని ప్రశ్నిస్తే వేలల్లో అని చెబుతారు

Update: 2024-08-28 04:28 GMT

ఆ కంపెనీ మార్కెట్ విలువ అక్షరాల రూ.2.5లక్షల కోట్లు. అంత భారీ కంపెనీలో ఉద్యోగులు ఎంతమంది ఉంటారని మిమ్మల్ని ప్రశ్నిస్తే వేలల్లో అని చెబుతారు. కానీ.. ఆ కంపెనీలోనాలుగు ఖండాల్లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 102 మాత్రమే. అంత పెద్ద కంపెనీ అయినప్పటికీ అంత తక్కువ మంది ఉద్యోగులున్న ఆ సంస్థ పేరేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

మూడు నాలుగు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ గురించి మాట్లాడుకోవటం తెలిసిందే. ఆయన్ను పారిస్ పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అతడు.. అతడి కంపెనీతో పాటు.. ఆ కంపెనీలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీసినప్పుడు ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూశాయి. రూ.2.5 లక్షల కోట్లు విలువైన మార్కెట్ ఉన్న సంస్థలో హెచ్ ఆర్ విభాగమే లేదన్న కొత్త విషయం బయటకు వచ్చింది.

అంతేకాదు.. కేవలం 30 మంది ఇంజినీర్లతోనే ఇంత పెద్ద కంపెనీని నడిపిస్తున్న తీరు చూస్తే.. పావెల్ తెలివికి ఫిదా కావాల్సిందే. హెచ్ ఆర్ విభాగం లేని నేపథ్యంలో కంపెనీకి సంబంధించిన ప్రతి అంశాన్ని పావెల్ నేరుగా చూసుకుంటారని చెబుతున్నారు. ఆన్ లైన్ పోటీలతో అత్యున్నత ప్రతిభ ఉన్న వారిని నేరుగా ఎంపిక చేసుకునే పావెల్.. మిగిలిన వారికి భిన్నమైన రీతిలో తన కంపెనీని నడిపిస్తారని చెబుతున్నారు.

రష్యాలో పుట్టిన పావెల్ తర్వాతి కాలంలో దుబాయ్ కు షిప్టు అయ్యారు. గతంలో అతనిపై ఉన్న అభియోగాలను పట్టించుకోకుండా.. అధికారులకు సహకరించటంలేదన్న పేరుతో పారిస్ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. పావెల్ అరెస్టులో ఎలాంటిరాజకీయాలు లేవన్న ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పేర్కొన్నారు. ఆగస్టు 24న అజర్ బైజాన్ నుంచి లేబోర్గట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సమయంలో అతడ్ని అక్కడి పోలీసులు కస్టడీకి తీసుకోవటం సంచలనంగా మారింది.

Tags:    

Similar News