కర్మ బలమైంది అంటూ వైసీపీ మీద ఒక రేంజిలో పవన్...!

అలాగే కర్మ అన్నది ఒకటి ఉంటుందని అది బలీయమైనది అని నమ్మే వారు అత్యధికం ఉంటారు.

Update: 2024-11-14 16:17 GMT

కర్మ సిద్ధాంతం గురించి అందరూ చెబుతూ ఉంటారు. మత సిద్ధాంతాన్ని నమ్మని వారు సైతం కర్మ అని అంటూంటారు. అలాగే కర్మ అన్నది ఒకటి ఉంటుందని అది బలీయమైనది అని నమ్మే వారు అత్యధికం ఉంటారు. ఈ నేపథ్యంలో కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తనదైన శైలిలో వైసీపీ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.

ఉప సభాపతి చెయిర్ లో రఘురామ క్రిష్ణం రాజుని ఆసీనులు చేశాక సభా సంప్రదాయం ప్రకారం సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం చేశారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ కర్మ బలమైనది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఎంపీగా ఉన్న రఘురామ క్రిష్ణం రాజుని సొంత నియోజకవర్గం నరసాపురంలో కూడా అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు.

అయితే కర్మ ఎవరినీ వదలదని అంటూ నాడు రఘురామను అడ్డుకున్న వారు ఇపుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోతున్నారని ఆయన వైసీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు పైగా ఇదంతా దేవుడి స్క్రిప్ట్ అని జగన్ 2019లో 151 సీట్లు గెలిచి తొలి అసెంబ్లీ సెషన్ నిర్వహించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ మరీ చురకలు అంటించారు. కర్మ ఎవరినైనా వదలదని అనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు.

వారూ వీరూ అని కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో అందరూ బాధితులే అని ఆయన అన్నారు. ఇక రఘురామను గత ప్రభుత్వం పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కావని ఆయన అంటూ ఆ కర్మ ఫలమే ఇపుడు ఇలా వెంటాడుతోంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

భావ ప్రకటన స్వేచ్చ పేరుతో సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సైతం అంతా బాధితులు అయ్యారని ఆయన అన్నారు. ఆ విధంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా వ్యక్తివ హననానికి పాల్పడ్డారని అన్నారు. ఆఖరుకు హోం మంత్రి అనితను సైతం వదలలేదని ఆయన చెప్పారు.

ఇదే సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల నుంచి రక్షణ కల్పించే పదునైన చట్టాన్ని రూపకల్పన చేసే విధంగా అడుగులు ముందుకు వేయాలని పవన్ కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా సభా ముఖంగా తాను ఇదే విషయం తెలియచేస్తున్నాను అని ఆయన అన్నారు.

ఈ విధంగా పదునైన చట్టం చేయడం ద్వారా దేశానికే ఏపీ ఒక సందేశం పంపించాలని కూడా ఆయన ఆకాంక్షించారు. ప్రజా స్వామ్యంలో భిన్న వాదనలు ఉండడం అవసరమని అయితే దానికి హద్దులు పరిమితులు ఉన్నాయని పవన్ అన్నారు. కానీ అది ఎలా ఉండాలన్నది కూడా చూడాలని అన్నారు.

భావ ప్రకటనా స్వేచ్చ ముసుగులో పాశవికంగా కొందరు తయారయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టేలా చర్యలకు దిగారని ఆయన అన్నారు. ఆఖరుకు శాడిస్టిక్ గా తయారయ్యారని అన్నారు. ఒక పార్లమెంట్ సభ్యునికే గత ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందంటే ఇక సామాన్యుడి సంగతేమిటి అని ఆయన ప్రశ్నించారు.

అంతే కాకుండా పవన్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నేరగాళ్లకు అసలు స్థానం ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంతో కూడిన విలువలను కాపాడడానికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాక్యలు వైరల్ గా మారాయి.

Tags:    

Similar News