కూటమి కంటిన్యూ... పవన్ సంగతేంటి ?
ఏపీలో టీడీపీ కూటమి కంటిన్యూ కావాలని చంద్రబాబు ప్రగాఢంగా కోరుకుంటున్నారు.
ఏపీలో టీడీపీ కూటమి కంటిన్యూ కావాలని చంద్రబాబు ప్రగాఢంగా కోరుకుంటున్నారు. అదే టైం లో ఈ కూటమిలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు అని చెబుతున్నారు. అంతా కలసి వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని చెబుతున్నారు. అయితే 2024 పొలిటికల్ సినారియో వేరు 2029 పొలిటికల్ సీన్ వేరు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు ముందు తన పార్టీ సమావేశాలలో అప్పట్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే జనసేన ఒక ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలిచి చూపిస్తే వచ్చే ఎన్నికల్లో డిమాండ్ చేయడానికి వీలుంటుంది అని అన్నారు. అలా కాకుండా ముందే సీట్లు ఎక్కువ తీసుకోవడం భావ్యం కాదని తన పార్టీ వారితో మాట్లాడుతూ చెప్పారు.
ఈ లెక్కన చూస్తే జనసేన బలం ఏంటి అన్నది 2024 ఎన్నికలు నిరూపించాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 21 సీట్లు ఇస్తే నూటికి నూరు శాతం విజయం సాధించి చూపించారు. అంతే కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అభ్యర్ధులకు భారీ ఎత్తున మెజారిటీలు రావడానికి జనసేన ఫుల్ సపోర్టు కారణం అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు 2029 ఎన్నికల్లో ఇదే కూటమితో కలసి వెళ్ళాలని పవన్ కూడా కోరుకుంటున్నారు.
ఆయన ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ కూటమిని విచ్చిన్నం ఎవరూ చేయలేరని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానిని బట్టి చూస్తే ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో విడిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉండరని అర్ధం అవుతోంది. మరి అలా చూస్తే కనుక కూటమితోనే 2029 లో బీజేపీ కూడా కలసి రావడం ఖాయమని అంటున్నారు.
ఇవన్నీ కూటమి కలసి రావడానికి కారణాలుగా చెప్పుకున్నా మరి కూటమి 2024లో ఉన్నట్లుగానే అవే పొత్తులు అవే సీట్లతో ముందుకు వెళ్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే 2024లో కేవలం 21 సీట్లను మాత్రమే తీసుకున్న జనసేన 2029 ఎన్నికల నాటికి తన పెరిగిన బలాన్ని చూపించి ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఖాయమని విశ్లేషణలు అయితే ఉన్నాయి.
అంతే కాదు బీజేపీ కూడా తమకు 2024లో పది సీట్లు ఇస్తే ఎనిమిది గెలిచామని కాబట్టి ఈసారి తన కోటా కూడా పెంచాలని కోరుతుంది. అలా ఈ రెండు పార్టీలు సీట్లను పెంచమనడమే కాకుండా ఈసారి అధికారంలో షేర్ కూడా కోరుతాయని ప్రచారం అయితే ఉంది.అది అపుడు టీడీపీ పెద్దలకు ఆమోదయోగ్యంగా ఉంటుందా అన్నదే చూడాలని అంటున్నారు.
ఎందుకు అంటే కూటమి కంటిన్యూ అయితే పెద్దన్న పాత్రలో టీడీపీ ఉంటుంది అన్నది ఒక మాట. మరి ఎపుడూ టీడీపీ పెద్దన్నగా ఉంటే పవన్ కళ్యాణ్ సంగతి ఏమిటి ఆయన సీఎం అవుతారని ఆశించే అభిమానుల సంగతి ఏమిటి వారితో పాటుగా దశాబ్దాలుగా సీఈం పదవి తమ సామాజిక వర్గానికి దక్కలేదని భావించే అతి పెద్ద వర్గం ఆకాంక్షల సంగతి ఏమిటి అన్న చర్చ కూడా ఉంది.
ఇలా మొత్తంగా చూసుకుంటే కనుక కూటమి కంటిన్యూ అయినా చాలా లెక్కలు మారుతాయని అంటున్నారు. అవి రాష్ట్ర స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకూ చాలానే మార్పులు తెస్తాయని అంటున్నారు. అలా అన్నీ కుదిరితేనే కూటమి రధం ముందుకు కదులుతుందని అంటున్నారు. సో ఇపుడున్న పరిస్థితులలో అంతా ఒక్కటే అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్నా తీరా ఫీల్డ్ లోకి దిగేసరికి చాలానే వ్యూహాలు చూడాల్సి ఉంటుందని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.