పోలీసుల మీద మళ్లీ పవన్ ఫైర్
ఇపుడు మరోసారి పోలీసుల తీరు మీద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ తాజాగా సూచించారు.
జనసేన అధినేత, టీడీపీ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది వైరల్ అవుతుంది. ఆయనకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. ఈ మధ్యకాలంలో ఏపీలో పోలీసుల తీరు పట్ల పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ కట్టు తప్పాయన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎంత రాజకీయ అలజడి సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆయన హోం మంత్రి తో పాటు డీజీపీ దాకా అందరినీ రివ్యూలు తరచూ చేయాలని కూడా సూచించారు.
ఇది జరిగి వారం రోజులు కూడా కాలేదు, ఇపుడు మరోసారి పోలీసుల తీరు మీద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ తాజాగా సూచించారు.
పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వస్తాయని ఆయన అనడం విశేషం. తునిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారని ఆ సమయంలో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మంచిది కాదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో పోలీసుల తరఫున బాధితుల కుటుంబాలకు క్షమాపణలు ఆయన చెబుతూ రెండు లక్షల రూపాయలను తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. ఈ ఘటనలో పవన్ ఏపీలో పోలీసుల తీరు ఏ విధంగా ఉందో మళ్లీ జనం కళ్లకు కట్టారని అంటున్నారు. వాస్తవంగా చూస్తే కనుక ప్రభుత్వానికి కళ్ళూ ముక్కూ చెవులుగా పోలీసులు ఉంటారు.
న్యాయం కోసం వెళ్లేవారికి వారే ఎదురుగా కనిపిస్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే తమకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తారు. అటువంటిది అక్కడ పోలీస్ వ్యవస్థ సవ్యంగా పనిచేయకపోతే ప్రభుత్వం మీదకే ఆ మచ్చ వస్తుందని అంటున్నారు. ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు అన్నది తెలిసిందే.
అందుకే పవన్ కళ్యాణ్ పదే పదే పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని ఐపీసీ కి అనుగుణంగా న్యాయంగా ధర్మంగా పనిచేయాలని కోరుతూ వస్తున్నారు. అంతే కాదు వారు తర తమ వివక్షను పక్కన పెట్టి బాధితులకు అండగా నిలిస్తే ప్రభుత్వానికి కూడా గౌరవం వస్తుద్నని అంటున్నారు.
పవన్ చేసే ఈ సూచనలను పోలీసులు పాటిస్తేనే మేలు అని అంటున్నారు. ఇదిలా ఉంటే పోలీస్ వ్యవస్థ పనితీరు పట్ల ఉప ముఖ్యమంత్రి గట్టిగానే నిఘా పెట్టారని అంటున్నారు. ఆయన అనునిత్యం గమనిస్తున్నారు అన్నది గుర్తెరిగి పోలీస్ శాఖ కూడా తన పనితీరులో గుణాత్మకమైన మార్పును తీసుకుని రావాలని అంటున్నారు. లేకపోతే పవన్ నోటి వెంట మళ్లీ మళ్లీ పోలీసుల తీరు పట్ల ఆగ్రహం అలా వ్యక్తం అవుతూనే ఉంటుందని అంటున్నారు.