నాగబాబుకు పెద్ద పదవి.. పవన్‌ ప్లాన్‌ ఇదే!

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ ఏర్పాటు చేశాక అందులోనూ తన తమ్ముడికి తన వంతు సహాయాన్ని నాగబాబు అందిస్తున్నారు.

Update: 2024-09-30 05:00 GMT

నాగబాబు జనసేన పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు. గతంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆయన వెనుక నాగబాబు క్రియాశీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ ఏర్పాటు చేశాక అందులోనూ తన తమ్ముడికి తన వంతు సహాయాన్ని నాగబాబు అందిస్తున్నారు.

ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున నాగబాబు పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే చివరకు బీజేపీతో పొత్తు కుదరడంతో ఆ సీటును ఆ పార్టీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో నాగబాబుకు సీటు లేకుండా పోయింది. కాగా 2019లో నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి లోక్‌ సభకు పోటీ చేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో కూటమి కోసం తన సీటును వదులుకోవడంతోపాటు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబుకు పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంచి గిఫ్టు ఇవ్వబోతున్నారని టాక్‌ నడుస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీటిని రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధనఖడ్‌ ఆమోదించారు.

ఈ నేపథ్యంలో ఈ మూడు పదవులను భర్తీ చేయాల్సి ఉంది. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేల బలం రీత్యా ప్రస్తుతం అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఈ మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. ఇందులో ఒకటి నాగబాబుకు ఇస్తారని టాక్‌ నడుస్తోంది.

నాగబాబుకు కేవలం రాజ్యసభ సీటు మాత్రమే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రిగానూ చోటు కల్పిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయేకు మద్దతు ఇస్తూ కేబినెట్‌ లో చేరని ఏకైక పార్టీ జనసేనే కావడం గమనార్హం. చివరకు జనసేనలాగే రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్న జేడీఎస్, ఒకే ఒక్క ఎంపీ స్థానం గెలుచుకున్న హిందూస్థానీ అవామ్‌ మోర్చాల నుంచి కూడా కేంద్ర కేబినెట్‌ మంత్రులున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రాలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదరడానికి, కూటమి గెలుపుకు ప్రధాన కారణమైన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ మాత్రం కేంద్ర కేబినెట్‌ లో తన ఎంపీలకు మంత్రి పదవులు తీసుకోలేదు. జనసేనకు ఇద్దరు ఎంపీలు బాలశౌరి (మచిలీపట్నం), తంగెళ్ల ఉదయ్‌ (కాకినాడ) ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర కేబినెట్‌ లో చేరలేదు.

నాగబాబు కోసమే కేంద్ర మంత్రివర్గంలో జనసేన చేరలేదని తెలుస్తోంది. ఆయనను రాజ్యసభకు పంపి.. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా తీసుకుంటారని టాక్‌ నడుస్తోంది. ఏపీ నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు కేటాయిస్తే మిగిలిన రెండు స్థానాల కోసం ఇటీవల ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన టీడీపీ నేతలు దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News