పవన్ కల్యాణ్ కాదు.. పని రాక్షసుడు!
అన్నింటికి మించి సినిమా.. రాజకీయాల్లో ఏది కావాలో తేల్చుకోవాలన్న సూటిపోటి మాటల నడుమ ఏళ్లకు ఏళ్లు రాజకీయ ప్రయాణం అంత తేలికైన విషయం కాదు.
ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలన్న పాత సామెతను అక్షరాల ఫాలో అయ్యారు పవన్ కల్యాణ్. మార్పు కోసం తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టటం.. అనూహ్య పరిణామాలతో ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేయటం.. అప్పటి వరకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ కావటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాజకీయాల్లో కొత్త శకానికి తెర తీయాలన్న తలంపుతో జనసేన పేరుతో పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. ఓవైపు అనుమానాలు.. మరోవైపు సందేహాలు.. అన్నింటికి మించి సినిమా.. రాజకీయాల్లో ఏది కావాలో తేల్చుకోవాలన్న సూటిపోటి మాటల నడుమ ఏళ్లకు ఏళ్లు రాజకీయ ప్రయాణం అంత తేలికైన విషయం కాదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎంత కపడినా ఫలితం దక్కని తీరుతో నిరాశకు గురైనప్పటికి వెనక్కి తగ్గకపోవటం పవన్ కు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకరికి విజయాన్ని ఇవ్వటం ఎంత సులువో అన్న పరిస్థితి నుంచి గెలుపు కోసం అవసరానికి మించిన శ్రమ సిద్ధమైన కమిట్ మెంట్ కు గెలుపు పవన్ వశమైంది. ఆలస్యంగా వచ్చే ఫలితం ఎలా ఉంటుందన్నది 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి.
వంద శాతం స్ట్రైక్ రేటుతో తెలుగు రాజకీయాల్లో శక్తివంతమైన పవర్ హౌస్ గా మారిన పవన్ మీద అప్పటికి ఎన్నో సందేహాలు. ఓటమిని నిండుగా ఆయన ఖాతాలో వేసేందుకు వెనుకాడని వారు.. అపూర్వ విజయాన్ని సాధించిన వేళ సైతం.. గాలివాటు గెలుపుగా చేసే వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోకుండా.. తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోయిన పవన్.. ఇప్పడు ఆయన విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాల్లేని స్థాయికి చేరిపోయారని చెప్పాలి.
సినీ నటులకు రాజకీయం వంట బట్టదని.. ఒకవేళ గ్లామర్ తో ఎన్నికల్లో విజయం సాధించినా.. పాలనతో ప్రజల మన్ననలు పొందటం అంత ఈజీ కాదనే వ్యాఖ్యలకు చేతలతో బదులిచ్చేశారు పవన్ కల్యాణ్. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన రోజున పవన్ పని తీరు మీద ఎవరికి ఎలాంటి అంచనాల్లేవు. మరో డిప్యూటీ సీఎంగానే అందరూ బావించారు. కానీ.. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే పది గంటల పాటు తన శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేసిన వేళ.. మొదటిసారి ఆయనలోని ‘లోతు’ పంచాయితీరాజ్.. అటవీశాఖ అధికారులతో పాటు.. గ్రామీణాభివృద్ధి శాఖాధికారులకు బాగా అర్థమైంది. అయినప్పటికి సందేహాలు విడిచి పెట్టని వారికి.. తన ఆఫీసుకు అవసరమైన ఫర్నీచర్ ను తన సొంత డబ్బులతో ఖర్చు చేసి ఏర్పాటు చేసుకోవటం ద్వారా.. వేలెత్తి చూపించేందుకు పవన్ ఎవరికి అవకాశం ఇవ్వరన్న మాట స్పష్టమైంది.
ఇక్కడ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాలి. సినిమాల్లో హీరోగా.. పవర్ స్టార్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవన్ గురించి అందరిలో అప్పుడప్పుడే ఆసక్తి మొదలైన రోజులవి. మిగిలిన హీరోల మాదిరి పీఆర్ టీంలను పెట్టుకోవటం.. పరిమితంగా ఉన్న మీడియా ప్రతినిధులతో పరిచయాలు పెంచుకోవటం.. అప్పటి సినీ పత్రికల కవర్ పేజీల కోసం కవర్లు ఇవ్వటం లాంటి వాటికి దూరంగా ఉండే పవన్ ఒక పట్టాన అర్థమయ్యే వారు కాదు. అందుకే ఆయన్ను ‘తేడా’ పేరుతో వ్యాఖ్యలు చేసేవారు. ఆయన గురించి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా మాట్లాడేవారు. ఎందుకిలా అంటే.. మాటలతో అదే పనిగా ఆకాశానికి ఎత్తేసే వారికి దూరంగా ఉండటం పవన్ కు మొదట్నించి అలవాటు. నిజానికి అదే ఆయనకు శాపమైంది. అయినప్పటికీ ఆయన మారలేదు.
తన గురించి నెగిటివ్ గా ప్రచారం చేసినప్పటికి.. ఆయనలోని హీరోను అభిమానులు అర్థం చేసుకోవటం.. ఆయన్ను అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే వరకు వెళ్లిపోయారు. తనకు అవకాశం ఉన్న ప్రతి పని చేయటం.. తన వద్దకు సాయం కోసం వచ్చే వారికి.. తన దగ్గర డబ్బుల్లేకున్నాఇచ్చేసే పెద్ద మనసు గురించి ఎవరు ఎలాంటి ప్రచారం చేయకున్నా.. ప్రజలకు చేరిపోయింది. ఇలాంటి సమయాల్లోనే పవన్ కు ఒక అలవాటు ఉండేది. వివిధ రంగాల్లో పట్టున్న పలువురు మేధావుల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని రోజుల తరబడి చర్చలు జరిపేవారు. తనతో మాట్లాడుతుంటే.. వారికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వారికి ఫ్యాన్సీ జీతాలు ఇచ్చేవారే తప్పించి.. ఉత్త చేతులతో పంపే వారు కాదు.
అలా సమాజం పట్ల ఒకలాంటి ఆర్తి పవన్ లో మొదట్నించి కనిపించేది. తన వారికి మెరుగైన జీవితాన్ని ఇవ్వటం కోసం తాను ఒక ఉపకరణంగా మారాలన్నట్లుగా ఆయన వ్యవహరించేవారు. ఈ క్రమంలో ఆయన అనుకున్న రీతిలో నడిచి ఉండకపోవచ్చు. కానీ.. తన చేతికి పాలనా అధికారం వస్తే తానెలా వ్యవహరిస్తానన్న విషయాన్ని చేతలతో చూపిన వ్యక్తి పవన్ కల్యాణ్. వరదలు పోటెత్తిన వేళలో.. మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. తాను పని చేస్తూ. అధికారుల చేత పని చేయిచటం మొదలు.. తన శాఖకు చెందిన పనుల్ని పరుగులు పెట్టించే విషయంలో ప్రగతిని సాధించారని చెప్పాలి.
ఈ కొద్ది కాలంలో తన చేతలతో తనకో కొత్త పేరును తెచ్చుకున్నారు. అదే.. పని రాక్షసుడు. ఇప్పుడు అధికారులు మొదలుకొని..ఆయనతో కలిసి పని చేసే వారి నోటి నుంచి తరచూ వస్తున్న మాట.. పవన్ కాదు పని రాక్షసుడని. అంతేకాదు.. తేడా జరిగితే తోలు తీస్తానన్న మాట చెప్పేందుకు వెనుకాడకపోవటం పవన్ కు మాత్రమే చెల్లిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. 2024 తెలుగు రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాలు సైతం పవన్ చుట్టూ తిరగటమే కాదు.. ఆయనకు సరికొత్త ఇమేజ్ ను తీసుకొచ్చిందని చెప్పాలి. తాను అనుకున్న లక్ష్యం దిశగా ఆయన మరింత వేగంగా వెళ్లాలని ఆశిద్దాం. నిజాయితీపరుల చేతికి పాలనా అధికారం వస్తే.. ప్రజల బతుకుల్లోనూ మార్పు ఖాయం.