బియ్యం మాఫియా...పవన్ కి సెక్యూరిటీ పెంచాలిసిందేనా ?

అవును.. ఇప్పుడీ చర్చ అందరి నోటా జరుగుతోంది. ఇప్పుడు కాలంలో నీతిగా.. నిజాయితీగా రాజకీయాలు చేయటం సాధ్యమే కాదు.

Update: 2024-12-01 09:30 GMT

అవును.. ఇప్పుడీ చర్చ అందరి నోటా జరుగుతోంది. ఇప్పుడు కాలంలో నీతిగా.. నిజాయితీగా రాజకీయాలు చేయటం సాధ్యమే కాదు. ఒకరిద్దరు అలా చేసినా.. వారి స్థాయి చాలా పరిమితంగా ఉంటుందే తప్పించి.. కీలక స్థానాలకు చేరుకోవటం కష్టం. దీనికి మినహాయింపుగా పవన్ కల్యాణ్ ను చెప్పాలి. సినిమా హీరోగా.. వెండితెరవేల్పుగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవన్.. తన వ్యవహారశైలితో మరింతగా పాపులర్ అయ్యారు. వ్యక్తిగత విషయాల్ని పక్కన పెడితే.. నీతి.. నిజాయితీ.. కమిట్ మెంట్ విషయంలో వంక పెట్టేందుకు.. వేలెత్తి చూపే సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి.

ఒకవేళ.. రాజకీయంగా ఉన్న విభేదాలతో అవినీతి మరక అంటించే ప్రయత్నం చేసినా.. వాటిని ఇప్పటివరకు నిరూపించలేని పరిస్థితి. ఇంత క్లీన్ చిట్ రాజకీయాల్ని చేసే పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ పాపులర్ అయ్యారని చెప్పాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. రెండు రోజుల క్రితం కాకినాడ పోర్టుకు వెళ్లి లక్షలాది కేజీల పేదల బియ్యాన్ని అక్రమంగా దేశాన్ని దాటించే దుర్మార్గాన్ని బట్టబయలు చేయటమే కాదు.. భారీ రిస్కును కొని తెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.

ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో పవన్ కల్యాణ్.. ఈ తరహా సాహసానికి పూనుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాకినాడ పోర్టులో తనిఖీలకు వెళ్లిన సమయంలో మాట్లాడిన పవన్.. తనను కాకినాడ పోర్టుకు రావొద్దని.. పది వేల మందికి సంబంధించిన అంశంగా తనకు చెప్పారన్నారు. పోలీసులు మొదలుకొని.. ఇతర శాఖల అధికారులు సైతం తనకు సహకరించలేదన్న పవన్.. జిల్లా ఎస్పీ సెలవు మీద వెళ్లటాన్ని ప్రస్తావించారు.

పవన్ కల్యాణ్ సాహసంతో వందలాది కోట్ల కుంభకోణం వెలుగు చూసినట్లైంది. ఇంతకాలం జరుగుతున్నా.. గుట్టు చప్పుడు కాకుండా సాగిన దందా.. పవన్ కారణంగా బట్టబయలైంది. దీంతో.. ఎంతోమంది ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదంపొంచి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కు హాని కలిగించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు పవన్ భద్రతను పునసమీక్షించాలని.. కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. బియ్యం మాఫియా ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలిసిందే. అలాంటి శక్తులకు చెక్ చెప్పటంతో పాటు చర్యల దిశగా అడుగులు వేస్తున్న పవన్ కు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై కేంద్రం తక్షణమే స్పందించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నాయి..

Tags:    

Similar News