ప్రత్యర్థులకు వేలెత్తి చూపే ఛాన్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్
సోమవారం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావటం.. దీనికి ఒక రోజు ముందు (ఆదివారం) నుంచే ఆయన ఎక్కడా కనిపించకపోవటంతో.. పవన్ కల్యాణ్ ఎక్కడ? ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కడ? అంటూ ఆరా తీస్తున్నారు.
వంక పెట్టేందుకు వీల్లేని వ్యక్తిత్వం ఏపీడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటూ ఆయన్ను ఫాలో అయ్యే వారంతా చెబుతుంటారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు.. రాజకీయ పార్టీ అధినేతలకు భిన్నంగా వ్యవహరించే తీరు పవన్ లో టన్నుల లెక్కన ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ నీతిగా ఉంటే అతి కొద్దిమందిలో పవన్ ఒకరుగా పేరుంది. ఆయనపై విమర్శలు చేసే వారు సైతం వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం.. ఆయన కమిట్ మెంట్ గురించి కించిత్ తప్పుగా మాట్లాడటానికి ఇష్టపడరు.
రాజకీయ నాయకుడిగా ఆస్తుల్ని పెంచుకోవటమే కానీ.. ఉన్నవి ఊడ్చేసే తీరు పవన్ లో కనిపిస్తుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న ఆయన.. తాజాగా ఏపీలో ఎదురైన విపత్తు వేళ.. పవన్ అడ్రస్ లేకుండా పోవటం.. ఆయన ఎక్కడ ఉందన్న విషయంపై క్లారిటీ రాకపోవటం ఆసక్తికరంగా మారింది. దీన్నో అవకాశంగా తీసుకున్న వైసీపీ డిప్యూటీ సీఎం ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడికి ప్రైవేటు జీవితం ఉండకూడదని చెప్పటం తప్పే అవుతుంది. అదే సమయంలో.. తాను అందుబాటులో లేని విషయాన్ని ఓపెన్ గా చెప్పేయటం.. తాను ఎక్కడున్న విషయాన్ని చెప్పేసి.. అక్కడి నుంచి తాను చేస్తున్న పని గురించి.. చేపట్టిన చర్యల గురించి వివరించి ఉంటే సరిపోయేది. తన పని తీరును వేలెత్తి చూపే అవకాశాన్ని ఇష్టపడని పవన్ తీరుకు భిన్నంగా తాజా వరదల వేళ మాత్రం తాను ఎక్కడ ఉన్నది? తానేం చేస్తున్న విషయాన్ని ఎవరితోనూ షేర్ చేయలేదు.
సోమవారం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావటం.. దీనికి ఒక రోజు ముందు (ఆదివారం) నుంచే ఆయన ఎక్కడా కనిపించకపోవటంతో.. పవన్ కల్యాణ్ ఎక్కడ? ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కడ? అంటూ ఆరా తీస్తున్నారు. అయినా ఫలితం ఉండని పరిస్థితి. ఇలాంటి అంశాలపై తక్షణ స్పందన అవసరం కానీ.. పవన్ నుంచి అదో లోపంగా మారింది. అధికార పక్షంగా ఇప్పటివరకు ఎవరి చేతా ఎలాంటి మాట అనిపించుకోకుండా పాలన సాగించిన పవన్.. విపత్తుతో విలవిలలాడే వేళ.. ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా చెప్పేస్తే సరిపోయేదన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ పవన్ ఇప్పుడెక్కడ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.