జనసేనకు ఏమైంది ?

ఇక అధినాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్షేత్రం అయిన ఏపీని వదిలేసి హైదరాబాద్ లోనే ఎక్కువగా గడుపుతున్నారు అని అంటున్నారు.

Update: 2024-09-19 21:30 GMT

జనసేన పదేళ్ళ వయసు ఉన్న పార్టీ. ఏపీలో మూడో ప్రాంతీయ పార్టీ. ఒక బలమైన సామాజిక వర్గం ఆశలు ఆకాంక్షలు అన్నీ అల్లుకుని ఏర్పాటు అయిన పార్టీ. అంతే కాదు ఏపీలో కొత్త రాజకీయం సరికొత్త ఆల్టర్నేషన్ కోరుకునే వారికి ఆశాకిరణంగా జనసేన ఉందని అంటారు.

ఆ పార్టీని స్థాపించి ముందుకు తీసుకుని వెళ్తున్నది పవర్ స్టార్, జనంలో యువతలో అపరిమితమైన ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్. జనసేన ఓటములను ఎలా చూసిందో దానికి మించి అద్భుతమైన విజయాలను కూడా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చవి చూసింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లను జనసేన గెలుచుకుని నూరు శాతం ఫలితాలను అందుకుంది. ఇది ఒక రికార్డుగా ఉంది. అలా పొలిటికల్ గా ట్రెండ్ సెట్ చేసిన జనసేనకు ఇపుడు ఏమైంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా మాదిరిగా జనసేనకు ఏమైంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మెల్లగా జనసేన సైలెంట్ మోడ్ లోకి వెళ్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది. దూకుడు రాజకీయానికి మారు పేరుగా ఉండే జనసేన ఇపుడు దానికి భిన్నంగా ఉంటోంది. నిశ్శబ్దానికి పర్యాయపదంగా మారిపోయింది. జనసేన ఆల్మోస్ట్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్తున్నట్లే అని కూడా అంటున్నారు.

జనసేనలో టాప్ టూ బాటమ్ అంతా గప్ చుప్ అన్నట్లుగా ఉంటున్నారు. గల గల పారే గోదారి మాదిరిగా దూకుడు చేసే జనసైనికులు సైతం ఫుల్ సైలెంట్ అయ్యారు. ఇది ఇంకా ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. నిజానికి జనసేన జెండా ఎత్తిన ప్రతీ వారూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నతమైన పదవిలో ఉండాలని అధికారంలో జనసేన ముఖ్య పాత్ర పోషించాలని బలంగా కోరుకున్నారు.

అది అయితే జరిగింది. జనసేన అధికారంలో కీలకంగా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీలో కూటమిలో జనసేన బలమైన మిత్రపక్షంగా ఉంది. మరి అధికారంలోకి వచ్చిన వేళ జనసైనికుల హుషార్ వేరే లెవెల్ లో ఉండాలి. కానీ అలాంటిది ఏమీ లేదు, అసలు జన సైనికులు హడావుడి ఏమీ ఎక్కడా కనిపించడం లేదు అని కూడా అంటున్నారు.

జనసైనికుల సందడి సైతం వినిపించకుండా పోయింది అన్నది కూడా అంతా గమనిస్తున్న విషయంగా ఉంది. ఈ విషయంలో జనసేన మీద వస్తున్న రాజకీయ విశ్లేషణలు కూడా ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయి. జగన్ చేసిన తప్పులే పవన్ చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోందిట.

ఎందుకు అలా అంటే జనసేనను నమ్ముకుని ఆ పార్టీ జెండా ఎత్తి తమ సర్వస్వం ధార పోసి పార్టీని నిలబెట్టిన వారిని కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారిని కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికే పెద్దగా ఫోకస్ ఇస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. అంటే సొంత పార్టీ వారికి ఆకులు ఇతర పార్టీ వారికి కంచాలు అన్న తీరు అన్న మాట.

ఇక అధినాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్షేత్రం అయిన ఏపీని వదిలేసి హైదరాబాద్ లోనే ఎక్కువగా గడుపుతున్నారు అని అంటున్నారు. ఆయన అక్కడికే పరిమితం అయ్యారని కూడా అంటున్నారు.జనసేనకు ఉన్న ఇద్దరు మంత్రులు కూడా పెద్దగా రెస్పాండ్ కావడం లేదు అని అంటున్నారు.

నిజంగా అధికారం ఒక అద్భుత అవకాశం. పార్టీని చక్కదిద్దుకునేందుకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఒక దీపంగా మారి వెలుగుని ఇస్తుంది. చీకట్లను పారదోలి పార్టీని పటిష్టం చేసుకునేందుకు ఇదే సువర్ణ అవకాశం. పవర్ ని నిచ్చెన మెట్లుగా వాడుకోవాలి.

పార్టీ అధికారంలోకి వస్తే సొంత వారికి అవకాశం ఇవ్వాలి. వారిని ముందుకు తీసుకుని వెళ్లాలి. ఎందుకంటే పార్టీ పునాదులుగా వారే ఉంటారు. అయితే తమాషా ఏంటి అంటే అధికారంలో ఉన్న పార్టీకి తామర తంపరగా రాజకీయ బంధువులు చాలా మంది వస్తూంటారు. వారు అధికారం అనే వెలుగు చూసి మాత్రమే వస్తారు.

అలా వచ్చిన వారినే బలం అనుకుని అందలం ఎక్కిస్తే మాత్రం సొంత వారూ డీలా అవుతారు, అవసరం తీరాక రాజకీయ బంధువులూ వెళ్ళిపోతారు. వైసీపీ ఇపుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. జనసేనకు అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే సొంత పార్టీ వారికి న్యాయం చేయాలి. క్యాడర్ ని పట్టించుకోవాలి. జెండా ఎత్తిన వారే పార్టీ మొదటి అజెండా కావాలి. బయట వారిని చేర్చుకోవచ్చు, కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ రాజకీయంగా సరైన వ్యూహాలతో ముందుకు సాగాలని అంటున్నారు. జనసేన తోటి పార్టీల ఫెయిల్యూర్స్ ని చూసి నేర్చుకోకపోతే ఈ పార్టీకి ఏమైంది అన్నదే అంతా అనుకునే పరిస్థితి ఉంటుంది.

Tags:    

Similar News