నన్ను చూసి నవ్వారు.. అవహేళన చేశారు: వారాహి సభలో పవన్
ఈ సందర్భంగా గురువారం సాయం త్రం ఆయన తిరుపతిలో వారాహి సభ నిర్వహించారు.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. మొత్తం 11 రోజుల పాటు దీక్ష చేసిన ఆయన.. బుధవారం తిరుమలలో విరమించారు. ఈ సందర్భంగా గురువారం సాయం త్రం ఆయన తిరుపతిలో వారాహి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి హిందువుల తీరును ఎండగట్టారు.
ముస్లింలకు ఒక పద్ధతి ఉందని.. అల్లా అని అంటే వారు ఆగిపోతారని..వారి ధర్మానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే.. అల్లాడిపోతారని తెలిపారు. కానీ, హిందువులు మాత్రం `గోవిందా` అన్నా ఆగరని వ్యాఖ్యానించా రు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు కొందరు ఈలలు, చప్పట్లతో మోతమోగించారు. దీనిపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ సభ కాదని.. హిందూ ధర్మానికి సంబంధించిన సభ అని ఈలలు వేయడం చప్పట్లు కొట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.
అనంతరం ఆయన తన ప్రసంగాన్నికొనసాగిస్తూ.. దేశంలో ఇస్లాం, క్రైస్తవం, సిక్కిజం, బౌద్ధం ఇలా ఎన్నో మతాలు ఉన్నాయని, వాటిలోనూ ఎంతో మంచి ఉందని.. దీనిని చూసి హిందువులు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయని తెలిపారు. సనాతన ధర్మం అన్ని ధర్మాలను, మతాలను గౌరవిస్తుందని.. అలాగని ఇలా కల్తీలు చేస్తే కూడా ఊరుకుంటారా? మౌనంగా ఉంటారా? అని హిందువులను ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం కల్తీ జరిగితే.. ఒక భక్తుడిగా తన హృదయం రగిలిపోయిందన్నారు.
దీనిని ప్రశ్నించేందుకే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టానని.. అయితే, ఇప్పుడు కూడా తనను కొందరు అవమానిస్తున్నారని, అవహేళనగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూలు కల్తీ అయిన మాట వాస్తవమేనని అన్నారు. ఇవే లడ్డూలను అయోధ్య రామమందిరానికి కూడా పంపించారని, దీంతో కోట్లాది మంది జంతువుల కొవ్వు కలిసిన లడ్డూలు తిన్నారని.. ఇది అపచారం కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం పాటించేవారంతా ఏకం కావాలని తాను దీక్ష చేపడితే.. దానికి కూడా కొందరు రాజకీయం జోడించి అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.