రేషన్ రైస్.. మారాల్సిందెవరు... మార్పు ఎందుకు.. !
అక్రమ మార్గాల్లో విదేశాలకు తరిలిపోతున్న బియ్యాన్ని నిలువరించేందుకు ఆయన ప్రయత్నాలు చేపట్టారు.
తాజాగా డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం అక్రమాలపై కన్నెర్ర చేశారు. అక్రమ మార్గాల్లో విదేశాలకు తరిలిపోతున్న బియ్యాన్ని నిలువరించేందుకు ఆయన ప్రయత్నాలు చేపట్టారు. అయితే.. అసలు రేషన్ బియ్యం విషయంలో మారాల్సిందెవరు? మార్పు ఎందుకు రావాలి? అనే ప్రశ్నలు.. కీలకంగా మారాయి. నిజానికి రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ సమస్య ఉంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆయన మరణం తర్వాత.. ఈ విషయం పక్కకు పోయింది. రేషన్ బియ్యం పేరుతో పేదలకు ప్రభుత్వాలు ఇస్తున్న బీటీ బియ్య.. దొడ్డుగా ఉండడంతోపాటు.. ఇవి త్వరగా అరగకపోవడం, అన్నం ముద్ద కావడం, తిన్నాక అనారోగ్య సమస్యలు వస్తుండడంతో రేషన్ బియ్యాన్ని తీసుకునే పేదలు.. వాటిని తెగనమ్మి.. నాణ్యమైన బియ్యాన్ని ఎంత ఖరీదుకైనా కొనుగోలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించాయి. ఈ విషయం జనసేన అధినేత పవన్‌కు కూడా తెలుసు. ఒక్కసారి 2019 ఎన్నికలకు ముందుకు వెళ్తే.. అప్పటి ఎన్నికల ప్రచారంలో పవన్ ఇదే విషయాన్ని చెప్పారు. ``రేషన్ బియ్యం తింటే కడుపునొప్పి వస్తోందని, వళ్లు నొప్పులు వస్తున్నాయని.. ఇప్పుడు ఇక్కడివారు చెప్పారు. అందుకే మేం అధికారంలోకి వస్తే.. రేషన్ బియ్యానికి అయ్యే ఖర్చును వారి ఖాతాలో వేస్తా. దీంతో వారు నాణ్యమైన బియ్యాన్నికొనుగోలు చేసేలా చూస్తాం`` అని చెప్పారు.
కానీ, అది సాధ్యంకాలేదు. ఇక, వైసీపీ అధినేత జగన్ కూడా.. అదే ఎన్నికల కు ముందు.. రేషన్ బియ్యం సమస్యను తెలుసుకుని.. నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది కొన్నాళ్లు నడిచింంది. తర్వాత.. మళ్లీ ఆగిపోయింది. అంటే.. మొత్తంగా రేషన్ బియ్యం ప్రజలు వినియోగించుకోవాలని నిజంగానే ప్రభుత్వాలు భావిస్తే.. వారు ఆనందంగా తీసుకునేందుకు, తినేందుకు ఉపయోగపడే నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే.. బియ్యం అమ్ముకోవాలని ప్రజలు కూడా భావించరన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఆదిశగా చర్యలు తీసుకుంటే.. అక్రమాలు వాతంటత అవే ఆగిపోతాయనడంలో సందేహం లేదు.