జగన్ ని గట్టిగా టార్గెట్.... పవన్ మాస్టర్ ప్లాన్ వెనక ?
జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే ఒక విషయంలో మాత్రం నిబద్ధతతో ఉన్నారని సెటైర్లు అయితే పడుతూ ఉంటాయి.
జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే ఒక విషయంలో మాత్రం నిబద్ధతతో ఉన్నారని సెటైర్లు అయితే పడుతూ ఉంటాయి. అది జగన్ వ్యతిరేక పంధాను అనుసరించడంలోనే అని కూడా అంటారు. ఆయన పార్టీ పదేళ్ళ రాజకీయంలో జగన్ ని టార్గెట్ గా చేసుకుంటూనే పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు అని వైసీపీ నేతలు నిందించడమూ జరుగుతోంది.
ఇక 2024 ఎన్నికలకు ముందు కూటమి కట్టడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. వైసీపీని గద్దె దించి తీరుతామని శపథం కూడా పట్టారు. మొత్తానికి కూటమి గెలిచింది. అలా ఇలా కాకుండా అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే పవన్ కి కూటమిలో సముచిత స్థానం దక్కింది. ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తొలి నాలుగు నెలలూ సైలెంట్ గా ఉన్న పవన్ ఇపుడు ఒక్కసారిగా మళ్లీ మీడియా ముందుకు వచ్చి వైసీపీ మీద భారీ విమర్శలు చేస్తున్నారు. తొక్కి పట్టి నారా తీస్తా అని పవర్ ఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఆయన పోలీసులను జగన్ బెదిస్తిస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ గానే డోస్ ఇచ్చారు.
ఇవన్నీ ఎందుకు అసలు పవన్ ఆలోచన ఏమిటి అన్నది ఇపుడు విశ్లేషిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఎంత కాదనుకున్నా 40 పర్సెంట్ ఓటు బ్యాంక్ ని కలిగి ఉంది. ఏపీలో టీడీపీ ఓటు బ్యాంక్ కూడా కచ్చితంగా నలభై శాతానికి తగ్గకుండా ఉంటుంది. అది 2019 నాటి దారుణమైన ఓటమి తరువాత కూడా టీడీపీ ఓటింగ్ పెర్సెంటేజ్ లో ఏ మార్పూ ఉండదు, దాని కంటే పెరుగుతుందే తప్ప తగ్గదు అనుకుంటే టీడీపీకి అది సాలిడ్ ఓటు బ్యాంక్ అన్న మాట.
పైగా గ్రౌండ్ లెవెల్ లో బూత్ లెవెల్ లో టీడీపీ పూర్తిగా విస్తరించి ఉంది. టీడీపీని కదపడం కానీ ఆ ఓటు బ్యాంక్ ని చెదరగొట్టడం కానీ ఎవరి వల్లా అయ్యేది కాదు. నాలుగు దశాబ్దాలుగా సైకిల్ పార్టీకి ఓటేసే జనాలను మార్చడం కష్టం. ఇక టీడీపీ జనసేన మిత్రులుగా ఉన్నారు. దాంతో జనసేన ఓటు షేర్ పెంచుకోవాలన్నా అతి పెద్ద పార్టీగా మారాలన్నా ఏపీలో మరో కీలకమైన పార్టీగా ఉన్న వైసీపీ నుంచే లాగాల్సిందే అని అంటున్నారు.
వైసీపీ ఓటు బ్యాంక్ ని ఎంత తగ్గిస్తే అంతలా అది జనసేనకు కలసి వస్తుంది. సాధారణంగా వైసీపీ ఓటర్లు టీడీపీకి యాంటీగా ఉంటారు. వారు ఆ సైడ్ తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. అదే మూడవ పార్టీగా ఉన్న జనసేన వైపు అయితే వెళ్ళేందుకు మొగ్గు చూపవచ్చు అన్నది ఒక అంచనా. పైగా జనసేనకు కూడా తన పార్టీ విస్తరణ కావాల్సి ఉంది.
ఎంతసేపూ మిత్రులుగా ఉంటూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం కంటే సోలోగా ఎదిగి తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవాలీ అంటే ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకోవాలి. ముందే చెప్పినట్లుగా ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ 40 పెర్సెంట్, టీడీపీ మరో 40 పెర్సెంట్ తీసుకుంటే మిగిలిన ఇరవై శాతంలో బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇతర పార్టీలు అయిదు శాతం పంచుకుంటే జనసేనకు ఆ పదిహేను శాతం ఓటింగే దక్కుతుంది. దానిని డబుల్ చేసుకుని ఏపీలో తాను కూడా అతి పెద్ద పార్టీగా మారాలీ అంటే వైసీపీ ఓటు బ్యాంకు బద్ధలు కొట్టడమే మార్గమని అంచనా వేసుకుంటున్నారు అని అంటున్నారు.
పైగా దేశంలో జమిలి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జమిలి ఎన్నికలు 2027 మొదట్లో జరుగుతాయని అంటున్నారు. అదే కనుక జరిగితే అప్పటికి మరిన్ని సీట్లను పెంచుకుని కూటమిలో పవర్ షేరింగ్ కి డిమాండ్ చేస్తే స్థాయికి రావాలీ అంటే జనసేన ఇపుడు అధికారంలో ఉండగానే తన వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంది. దాంతోనే జగన్ ని మళ్ళీ గట్టిగానే జనసేన టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. వైసీపీ హార్డ్ కోర్ ఓటు బ్యాంక్ దీని వల్ల చెదిరిపోకపోయినా ఆ పార్టీకి ఓటేసిన న్యూట్రల్ వర్గాలు ఇతర వర్గాలను అటు నుంచి ఇటు వైపు తిప్పుకున్నా జమిలి ఎన్నికల నాటికి 30 పర్సెంట్ ఓటు షేర్ జనసేనకు దక్కుతుంది అన్న ఆలోచనలతోనే ఈ విధంగా చేస్తున్నారా అన్న చర్చ అయితే నడుస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.