మినిస్టర్ నాగబాబు...పవన్ చెప్పినది జనం మెచ్చేనా ?
రాజకీయాల్లో ఏమి చేసినా జనం కోణం నుంచే చూసి చేయాలి. ఒకసారి అధికారం దక్కాక ఎవరు ఏమి చేసినా జనాలు ఏమీ అనలేరు.
రాజకీయాల్లో ఏమి చేసినా జనం కోణం నుంచే చూసి చేయాలి. ఒకసారి అధికారం దక్కాక ఎవరు ఏమి చేసినా జనాలు ఏమీ అనలేరు. కానీ వారు అన్ని కోణాల నుంచి చూస్తారు. నాగబాబు మినిస్టర్ పదవికి అర్హుడా కాదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. ఆయనకు మినిస్టర్ పదవి ఇస్తే అన్నదమ్ములు ఇద్దరికి పదవులు దక్కాయన్న విమర్శలు వస్తాయన్నదే చర్చ.
రాజకీయాల్లో వారసత్వాలు సహజమే అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా జనాలు ఎంతవరకూ చూస్తారు అన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. పవన్ రొటీన్ పొలిటీషియన్ కాదు అని అంతా ఈ రోజుకీ నమ్ముతారు. ఆయన ద్వారా రాజకీయాలలో మార్పుని చూడాలని అనుకునే వారే ఎక్కువ మంది ఉంటారు.
ఒక రాజకీయ పార్టీ పట్ల రాజకీయ నాయకుడి పట్ల దిగువ వర్గం ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటుంది. ఉన్నత వర్గాలు తమ అవకాశాల కోసం ఆయా పార్టీలకు అభిమానులుగా ఉంటారు. కానీ మధ్యతరగతి ఎపుడూ రాజకీయ పార్టీల పట్ల నేతల పట్ల ఎంతో కొంత వైముఖ్యంగా ఉంటుంది. కానీ పవన్ విషయంలో ఇది రివర్స్. ఆయనకు ఎక్కువగా మధ్యతరగతి వర్గంలోనూ అభిమానం జనం ఉన్నారు.
వారంతా వారసత్వాలకు అవినీతికి వ్యతిరేకంగా ఉంటారు. అంతే కాదు రాజకీయాల్లో మార్పు రావాలని ఎలుగెత్తి నినదించేవారు ఈ సెక్షన్ లోనే ఉంటారు. ఇదిలా ఉంటే పవన్ కూడా అవినీతికి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగానే గళం విప్పుతూ వచ్చారు. అందుకే ఆయన బాగా ఆకట్టుకోబడ్డారు.
ఇపుడు ఆయన తన సోదరుడు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి మంత్రి పదవి ఇస్తే తప్పేమిటి అని అంటున్నారు. ఆయన వాదనలో సబబు ఉండవచ్చు. కానీ నాగబాబుకు ప్రయారిటీ ఇచ్చి గౌరవించడానికి మంత్రి పదవి ఒక్కటే మార్గం కాదు కదా అన్న మాట కూడా ఉంది. ఆయనను పార్టీలో కీలక స్థానంలో ఉంచవచ్చు. లేదా రాజ్యసభ సీటు ఖాళీ అయితే ఢిల్లీకి పంపి పార్లమెంట్ లో పార్టీ గళం మరింత గట్టిగా వినిపించేలా చేయవచ్చు.
అయితే ఏపీలో మంత్రిగా నాగబాబుని తీసుకోవడం వల్ల ఆయనకు న్యాయం జరుగుతుందేమో కానీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా చర్చగానే ఉంది. ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వంలో తండ్రీ కొడుకులు ముఖ్యమంత్రి, మంత్రిగా ఉన్నారు. అలాగే బాలయ్య వియ్యంకుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరో అల్లుడు విశాఖ ఎంపీగా ఉన్నారు.
టీడీపీ విషయంలో దీని మీద కొంత చర్చ ఉంది. ఆ పార్టీ దానిని ఎలా చూసినా రొటీన్ పాలిటిక్స్ టీడీపీలో ఉంటుంది అని అంతా అనుకుంటారు జనసేన నుంచి ఈ తరహా రాజకీయం ఆశించరేమో అన్నదే చర్చగా ఉంది. పైగా జనసేనకు నలుగురు మంత్రులు ఉంటే అందులో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అన్నది కూడా విపక్ష వైసీపీకి అస్త్రంగా మారుతుంది అన్నది కూడా ఉందని అంటున్నారు.
జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో కాపులు ఎక్కువగా ఉండవచ్చు. కానీ బీసీలు ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఉన్నారు. జనసేనకు వచ్చిన నాలుగో మంత్రి పదవికి బీసీలకు ఇచ్చినా వేరే ఇతర సామాజిక వర్గానికి ఇచ్చినా ఆ పార్టీ రాజకీయంగా సామాజికపరంగా మరింతగా విస్తరించే అవకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు.
మొత్తం మీద చూస్తే జనసేనానిగా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నది పవన్ ఇష్టం. ఆయన నాగబాబుని ఎంపిక చేయడాన్ని సమర్ధించుకోవచ్చు. కానీ ఈ నిర్ణయం రేపు జనంలో ఎంత మేరకు అంగీకారంగా ఉంటుంది అన్నది కూడా ముందు ముందు చూడాల్సి ఉంది.