లోకేష్ తనయుడు, బాబు మనవడుకి పవన్ ట్వీట్.. ఆకాంక్ష ఇదే!
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ కు రాజకీయాలకు అతీతంగా కూడా చంద్రబాబుతో మంచి అండర్ స్టాండింగ్ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ కు రాజకీయాలకు అతీతంగా కూడా చంద్రబాబుతో మంచి అండర్ స్టాండింగ్ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక.. గాసిప్స్ సంగతి పక్కనపెడితే పవన్ – లోకేష్ కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ముందుకెళ్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో పవన్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
అవును... నారా వారి ఫ్యామిలీతో జనసేన అధినేతకు అటు రాజకీయ మిత్రత్వంతో పాటు వ్యక్తిగత అనుబంధం కూడా పెరుగుతుందనే చర్చ ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు పవన్ కల్యాణ్. కాస్త ఆలస్యం అయినప్పటికీ ఈ ట్వీట్, దీనికి సంబంధించిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది.
నారా లోకేష్ తనయుడు, చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ చెస్ క్రీడల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. 11 నిమిషాల 59 సెకన్లలోనే 175 క్లిష్టమైన చెస్ పజిల్స్ సాధించారు. ఫలితంగా.. "ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్" గా దేవాన్ష్ "వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్" లో స్థానం దక్కించుకున్నారు.
దీంతోపాటు దేవాంశ్ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్టాత్మక "వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - లండన్" అధికారికంగా ధృవీకరించింది. గత ఏడాది డిసెంబర్ 22న ఈ పోటీ జరగ్గా.. ఈ ఘనతపై అటు చంద్రబాబు, ఇటు లోకేష్, నారా బ్రాహ్మణి తో పాటు పలువురు టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆన్ లైన్ వేదికగా దేవాన్ష్ ను అభినందించారు.
ఈ నేపథ్యంలో.. పవన్ తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా.. ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తనయుడు, సీఎం చంద్రబాబు మనవడు, దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... చిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన దేవాన్ష్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవాన్ష్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.