పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్దామంటే వెనక్కి లాగుతున్నారా ?

అలాంటి పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో ఉన్నారు అంటే దానికి న్యూ లుక్ వస్తుందని అంతా అనుకున్నారు.

Update: 2024-08-27 20:30 GMT

జనసేన అధినేత, టీడీపీ కూటమిలో ముఖ్య భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ వంద రోజుల ప్రభుత్వ పాలనలో ఏమి చేస్తున్నారు, ఆయన ముద్ర ఏమైనా పడిందా అన్న చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ అంటేనే కొత్తగా ఆలోచిస్తారు. కొన్ని ఆదర్శ భావాలను ముందు పెట్టుకుని ఆయన అడుగులు వేస్తారు.

అలాంటి పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో ఉన్నారు అంటే దానికి న్యూ లుక్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ రెండున్నర నెలలు దాటిపోయింది. ప్రభుత్వం నడుస్తోంది కానీ ఎక్కడా పవన్ బ్రాండ్ అన్నది అయితే కనిపించడం లేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లాలని చూసినా ఆయన్ని వెనక్కి లాగుతున్నారు అన్న చర్చ నడుస్తోంది.

నిజానికి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ శాఖ తీసుకుంటారు అని ప్రచారం సాగింది. అది హోం శాఖ అని అనుకున్నారు. కానీ పవన్ ఎంచుకున్నది పంచాయతీ రాజ్ శాఖ. ఆ శాఖ ఎందుకు తీసుకున్నాను అన్నది ఆయన ఇటీవల జరిగిన గ్రామ సభలలో చెప్పుకొచ్చారు. ఎంతో కమిట్ మెంట్ తో ఆయన ఆ శాఖను తీసుకున్నారు. ఇక పంచాయతీ రాజ్ శాఖ చాలా పెద్ద శాఖ.

ఇటు క్షేత్ర స్థాయిలో సర్పంచులతో నేరుగా కనెక్షన్ ఉండే శాఖ. అలాగే మరో వైపు కేంద్ర ప్రభుత్వంతోనూ అనుసంధానం అయ్యే శాఖ. ఆ విధంగా చూస్తే పంచాయతీ రాజ్ శాఖ టాప్ టూ బాటమ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గ్రామాలలో పట్టు ఉందే విధంగా నేరుగా సర్పంచులతో మాట్లాడి వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్స్ అయ్యేటట్ట్లుగా చేద్దామని అంటే అతనిని వెనక నుంచి ఎవరో గట్టిగా లాగుతున్నారని అంటున్నారు.

కేంద్రంతో మాట్లాడి సర్పంచులకు వెంటనే అయ్యే విధంగా బిల్స్ ని క్లియర్ చేయిస్తే జనసేనకు మంచి పలుకుబడి వస్తుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే అది ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు, సాధ్యం కావడం లేదు అని అంటున్నారు.

టీడీపీలోనే ఉన్న కొందరు పెద్దలకు జనసేన ఈ విధంగా రూరల్ లో బేస్ సంపాదించి బాగుపడడం ఇస్ఠం లేదని అంటున్నారు. జనసేనకు గ్రామాలలో మంచి పట్టు వస్తే క్షేత్ర స్థాయిలో పటిష్టం అయితే అది తమకు ఇబ్బందికరం అని భావిస్తున్నారేమో అన్న చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన చిన్న పార్టీగా ఎప్పటికీ కూటమిలో ఉండాలన్నది వారి ఆలోచన అని అంటున్నారు. అందువల్లనే పవన్ తాను అనుకున్న వాటిని చేయలేకపోతున్నారు అని అంటున్నారు. నిజానికి పవన్ కి కేంద్ర ప్రభుత్వం వద్ద మంచి పలుకుబడి ఉంది. దాంతో ఆయన సర్పంచులకు చేయగలిగింది చాలానే చేయగలరు. కానీ అదే సమయంలో ఆయన కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు అని అంటున్నారు.

దాంతోనే ఆయన ముందుకు వెళ్లలేక అలా ఉండిపోతున్నారు అని అంటున్నారు. ఇక పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న మొత్తం 13 వేల పై చిలుకు గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించడం సర్పంచులనే వేదిక మీద పెట్టి అధ్యక్షత హోదా ఇవ్వడం ఇవన్నీ పవన్ ఆలోచనలే. నిజానికి ఈ గ్రామ సభలను ఒక రోజు కాదు వారం రోజుల పాటు నిర్వహించాలని పవన్ ఆలోచించారని కూడా చెప్పుకున్నారు.

దాని వల్ల గ్రామ సమస్యలు మొత్తం అందరి దృష్టికి వస్తాయని తద్వరా గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని తలచారు అని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ గ్రామ సభలు ఒకే రోజు మాత్రం జరిగి ఆగిపోయాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పలుకుబడి పెంచే ఏ నిర్ణయం అయినా కూటమిలో సాగడం లేదు అన్న ప్రచారం అయితే సాగుతోంది. అసలే సినీ గ్లామర్ నిండుగా యువత అభిమానం దండిగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏ మాత్రం పుంజుకున్నా ఇబ్బంది అని తలచే ఆయనను వెనక్కి లాగుతున్నారా అన్న డౌట్లు పెరిగిపోతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News