వారేమి పాపం చేశారు...అసెంబ్లీ ముఖం చూడకుండానే ?

సభ ముఖం చూడకుండా అయిదేళ్ళూ వైసీపీలో కీలక నేతలు సీనియర్లు గడపవచ్చేమో కానీ కొత్తగా నెగ్గిన వారు సభకే రాకుండా పోతే వారు గెలిచి లాభమేంటి అని కూడా అంటున్నారు.

Update: 2024-11-19 09:30 GMT

వైసీపీకి 2024 ఎన్నికల్లో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో ఎక్కువ మంది కొత్తగా గెలిచి వచ్చిన వారే. వైసీపీకి ఈసారి సీనియర్లు ఎవరూ పెద్దగా లేరు అన్నది ఒక వైపు లోటు అయితే కొత్తవారు గెలవడం అన్నది మరో విధంగా అడ్వాంటేజ్. వారి ఉత్సాహాన్ని కూడా పార్టీ వాడుకోవచ్చు.

అదే సమయంలో వారిని అసెంబ్లీకి పంపించి సభలో వారిని మంచి ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేయవచ్చు. వైసీపీ తరఫున చూస్తే గెలిచిన వారిలో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (పులివెందుల), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి (తంబళ్ళపల్లి), వై. బాలనాగిరెడ్డి (మంత్రాలయం) ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి (రాజంపేట), దాసరి సుధ (బద్వేలు), విరూపాక్షి (అలూరు), తాటిపత్రి చంద్రశేఖర్‌ (ఎర్రగుండపాలెం) బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి (దర్శి), రేగం మత్స్యలింగం (అరకు), మత్స్యరాస విశ్వేశ్వరరాజు (పాడేరు) ఉన్నారు.

ఇందులో కొత్తగా ఎమ్మెల్యేలుగా అయిన వారు అలూరుకి చెందిన విరూపాక్షి, అలాగే ఎర్రగొండపాలెం కి చెందిన తాటిపత్రి చంద్రశేఖర్, అరకు పాడేరులకు చెందిన రేగం మత్య్సలింగం మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఉన్నారు.

ఈ నలుగురు అసెంబ్లీకే కొత్త. వీరు అసెంబ్లీ ముఖం తొలి సారి చూస్తున్న వారు. మిగిలిన వారు రెండేసి మూడేసి సార్లు గెలిచి ఉన్నారు. కానీ ఈ నలుగురికీ మాత్రం శాసన సభ అంటే ఇదే మొదటిసారి చూస్తున్నారు.

వైసీపీలో చూస్తే అసెంబ్లీకి జగన్ రాను అని అంటున్నారు.దానికి ఆయన కారణాలు చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను సభకు వస్తాను అని అంటున్నారు. అయితే ఆ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉంది. సభా సంప్రదాయాలను కూటమి పెద్దలు చెబుతున్నారు.

పైగా ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా తప్పించి మేము ఏమిటి ఇచ్చేది అని అంటున్నారు. వైసీపీని చిత్తుగా ఓడించినది ప్రజలే అని గుర్తు చేస్తున్నారు.ఈ వివాదం ఇలా నడుస్తూ ఉండగానే పుణ్య కాలం గడచి పోతోంది. ఈ ఏడాదికి బడ్జెట్ సమావేశాలే ఎక్కువ రోజులు సాగేవిగా ఉన్నాయి. దీని తరువాత మళ్లీ మార్చిలో బడ్జెట్ సెషన్ ఉండవచ్చు అని అంటున్నారు. ఇక కొత్తగా వైసీపీ తరఫున గెలిచిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. నాటి నుంచి సభకు వారు వెళ్ళడం లేదు.

ప్రజలు వారిని గెలిపించారు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ప్రస్తావిస్తారు అని కూడా వారిని ఆదరించారు. అయితే వీరికి కూడా సభకు వెళ్ళి అధ్యక్షా అని పిలవాలని ఉంది. అంతే కాదు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాలని ఉంది.

కానీ అధినాయకత్వం అసెంబ్లీకి పోవద్దు అని చెప్పడంతో మిన్నకుండిపోతున్నారు. ఇక మిగిలిన వారి అందరికీ అసెంబ్లీ గురించి అక్కడ జరిగే బిజినెస్ గురించి బాగానే అవగాహన ఉంది. కానీ ఈ నలుగురూ కూడా సభకు వెళ్ళి తాము కూడా చర్చలలో పాల్గొనాలని ఉన్నా అవకాశం అయితే లేకుండా పోతోంది.

ఇక బద్వేల్ కి 2021లో ఉప ఎన్నిక జరిగితే గెలిచిన దాసరి సుధ కూడా కొత్త వారి కిందకే వస్తారు. ఆమె కూడా సభకు వెళ్ళి ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సి ఉంది. దాదాపు పదిహేనేళ్ళ తరువాత దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలిచారు. అయన 2009 తరువాత మళ్ళీ అసెంబ్లీకి నెగ్గిది 2024లోనే. ఆయన కూడా సభకు హాజరవాలని అనుకోకుండా ఉండగలరా అని అంటున్నారు. అలాగే ఆకేపాటి అమరనాధరెడ్డి కూడా చాలా కాలం తరువాత గెలిచారు ఈ విధంగా చూస్తే ఎక్కువ మందికి సభకు రావాలనే ఉందని ప్రచారంలో ఉంది.

ఇక జగన్ ప్రతిపక్ష హోదా కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. దాంతో ఆయన సభకు రాకపోయినా మిగిలిన వారిని సభకు పంపించి అయినా ప్రజా సమస్యలను ప్రస్తావించేలా చూస్తే అది వారికీ వైసీపీకి కూడా మేలు చేసేలా ఉంటుందని అంటున్నారు.

సభ ముఖం చూడకుండా అయిదేళ్ళూ వైసీపీలో కీలక నేతలు సీనియర్లు గడపవచ్చేమో కానీ కొత్తగా నెగ్గిన వారు సభకే రాకుండా పోతే వారు గెలిచి లాభమేంటి అని కూడా అంటున్నారు.దంతో వారేమి చేశారు పాపం అన్న మాట కూడా వినిపిస్తోంది.

Tags:    

Similar News