ఏపీ అసెంబ్లీలో ఆ ఇద్దరు పుస్తకాల పురుగులు పక్కపక్కనే
పుస్తకాలు చదవడం చాలా గొప్ప అలవాటు. మనిషిలో వ్యక్తిత్వ వికాసానికి, కొత్త ఆలోచనలకు పుస్తకాలు బాట వేస్తాయి.
పుస్తకాలు చదవడం చాలా గొప్ప అలవాటు. మనిషిలో వ్యక్తిత్వ వికాసానికి, కొత్త ఆలోచనలకు పుస్తకాలు బాట వేస్తాయి. వ్యక్తి ఉన్నతికి తోడ్పడతాయి. అందుకనే పుస్తకాలను స్నేహితులుగా చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఇంతటి గొప్ప లక్షణం ఇప్పటికీ చాలామందికి అలవాటుగా మారలేదు. అందులోనూ సోషల్ మీడియా వచ్చాక పుస్తకాలు చేత పట్టుకోవడం అనే మాటే లేదు. కానీ, పాత కాలంలో చాలామందికి పుస్తక పఠనం ఓ వ్యసనం.
పుస్తకం పట్టుకుంటే రోజులే గడిచిపోతాయ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఇటీవల కాలం చేసిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు వరకు తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాల ప్రియుల్లో ప్రముఖులు. ఇక పుస్తకాలను అమితంగా ఇష్టపడే రాజకీయ నాయకుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్. స్కూల్, కాలేజీలకు పెద్దగా వెళ్లకున్నా.. పవన్ వివేకం, నాలెడ్జ్ సంపాదించారంటే అది పుస్తకాల కారణంగానే. రాజకీయాల్లో పదేళ్లలో, మరీ ముఖ్యంగా గత ఐదేళ్లలో వ్యక్తిగతంగా దూషణలు ఎదుర్కొన్న పవన్ ను అత్యంత సంయమనం పాటించేలా చేసింది పుస్తకాలే. ఆయన ఇల్లు, ఫామ్ హౌస్ లోనూ పుస్తకాలే పుస్తకాలు అని చెబుతారు.
పుస్తకాల కేశవ్..
ఏపీ ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్నీ కలిసొచ్చి ఈసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాను గెలిస్తే పార్టీ గెలవదనే అపప్రథను చెరిపేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితుల రీత్యా అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను ఆయన భుజాలపై ఉంచారు. అయితే, కేశవ్ గురించి చాలామందికి తెలియని విషయం ఏమైనా ఉందంటే అది ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అని. గతంలో ఆయన ఎక్కడ పుస్తక ప్రదర్శన జరిగినా వెళ్లి కొత్త పుస్తకాలు కొనేవారు.
ఇద్దరూ పక్కపక్కనే..
పుస్తకాల ప్రియులైన పవన్, కేశవ్ ఇద్దరూ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో పక్కపక్కన కూర్చుంటున్నారు. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారు కూడా. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.