జగన్ కు ఫోన్ చేసిన పవన్... మానసిక స్థితి సరిగా లేదని కామెంట్!

ఈ సందర్భంగా జగన్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. జగన్ సైకో అని, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Update: 2023-09-17 05:42 GMT

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో శనివారం రాత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. జగన్ సైకో అని, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే సమయంలో జగన్ కు తాను ఫోన్ చేసినట్లు చెప్పుకున్నారు పవన్... ఆ సమయలో జగన్ తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు.

అవును... టీడీపీతో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించిన పవన్... జగన్ పై తనదైన శైలిలో ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా జగన్ కు ఫోన్ చేస్తే గౌరవం లేకుండా మాట్లాడరని, ఆయనకు 151 సీట్లు గెలిచిన గర్వం పుష్కలంగా ఉందని చెప్పుకొచ్చారు.

"2019 ఎన్నిక‌ల అనంత‌రం ఒక‌సారి తాను జ‌గ‌న్‌ కు ఫోన్ చేశాను.. నేను ఆయ‌న్ని సార్ సార్ అని సంబోధిస్తుంటే.. జ‌గ‌న్ మాత్రం ప‌వ‌న్ ప‌వ‌న్ అంటూ నన్ను ఏక‌వ‌చ‌నంతో మాట్లాడారు. 151 సీట్లలో గెలిచిన అహంకారం అప్పుడు జ‌గ‌న్ మాటల్లో క‌నిపించింది" అని పవన్ తెలిపారు. నాలుగేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు భరించాను.. ఇకపై ఊరుకునేది లేద‌ని ప‌వ‌న్ హెచ్చరించాడు.

ఇదే సమయంలో... త‌న‌ను ఏపీలోకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని, ఇలా ప‌లుమార్లు త‌న ప‌ర్యట‌న‌ల‌ను అడ్డుకున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేసిన పవన్... ఒక‌ప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఆ రాష్ట్రంలోకి వెళ్లడానికి పాస్ పోర్ట్, వీసా అవ‌స‌రం అవుతుంద‌ని వ్యాఖ్యానించార‌ని.. అయితే జ‌గ‌న్ మాత్రం ఏపీలోకి ఎవ‌రు రావాల‌న్నా వీసా, పాస్ పోర్ట్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి క‌ల్పించాడ‌ని ఎద్దేవా చేశారు.

అనంతరం... జగన్‌ మానసిక స్థితి సరిగా ఉందో లేదో నిర్ధారించుకోవాలని, ఈ విషయం తాను సరదాగా చెప్పడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ఇలా.. మానసిక ఆరోగ్యం సరిగా లేని మనిషి చేతిలో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు పెట్టగలమా అని ప్రశ్నించారు. ఆయనేదో చేసేస్తాడని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని, ఆయనది మానసిక బలం కాదు... పిచ్చి అని పవన్ కల్యాణ్ విమర్శించారు.

చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్నా కూడా ఆయన బయట రోడ్లపై హాయిగా తిరిగేవారని.. జైలులో ఖైదీల మధ్య ఉంటే ఆయన భద్రతకు ఇబ్బందని.. అయినా బాగానే ఉన్నారని చెప్పుకొచ్చిన పవన్... జగన్ కు ఏం భద్రత సమస్య వచ్చిందని బయటకు వెళ్తే పరదాలు కట్టిస్తారు.. చెట్లు కొట్టిస్తారు.. అని ఫైరయ్యారు. అందుకే... వైసీపీ నాయకులు ఆయనను సైకియాట్రిస్టుకు చూపిస్తే మేలని సూచించారు.

ఇదే సమయంలో జగన్ పై మరింత తీవ్రంగా స్పందించిన పవన్... ప్రజలకు కోపమొస్తే నిన్ను కొట్టి చంపేస్తారు జగన్.. అప్పుడు ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు.. అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నుంచి తాను వస్తుంటే ఏపీ సరిహద్దుల్లో ఆపేసి.. ముందుకు రానివ్వలేదు సరికదా.. వెనక్కి వెళ్లిపోమన్నారని అన్నారు. ఎందుకు వెళ్లాలని అడిగితే మాత్రం... ప్లీజ్‌ సార్‌ అర్థం చేసుకోండి అన్నారు. అసలు మీరేం అధికారులయ్యా? అని మండిపడ్డారు పవన్.

Tags:    

Similar News