నాకు సలహాలు ఇవ్వొద్దు...జోగయ్యకేనా...!?
ఇక తనకు సలహాలు సూచనలు ఇస్తున్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య లాంటి పెద్దలకు పరోక్షంగానే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్టలు తెంచుకున్న ఆవేశంతో తాడేపల్లి సభలో ప్రసంగం చేశారు. ఆయన వైసీపీ మీద మాటల యుద్ధమే చేశారు పలు సార్లు మైకు పట్టుకుని స్టేజ్ ముందుకు వచ్చి మరీ బిగ్ సౌండ్ చేశారు. జగన్ ని ధాటీగా విమర్శిస్తూనే అదే నోటితో తన సొంత పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు.
ఇక తనకు సలహాలు సూచనలు ఇస్తున్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య లాంటి పెద్దలకు పరోక్షంగానే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు. నాకు మీరు సలహాలు ఇవ్వవద్దు. నాకు ఏమి చేయాలో బాగా తెలుసు అంటూ పవన్ గట్టిగా చెప్పారు. జగన్ గురించి పూర్తిగా తెలుసుకునే నేను యుద్ధానికి దిగుతున్నాను అని పవన్ అన్నారు.
మీరు మాతో యుద్ధానికి వస్తే కలసి చేద్దాం, అంతే తప్ప సలహాలూ సూచనలు అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేయకండి అని హెచ్చరించారు. నేను ఏమీ తెలియకుండా ఉంటున్నానా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల పాటు పార్టీని నడుతున్న నాకు ఏమీ తెలియదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే అన్నారు.
నేను వేసే ప్రతీ అడుగులో వ్యూహం ఉంది అని ఆయన చెప్పుకున్నారు. నన్ను ప్రశ్నించవద్దు, దయచేసి నన్ను సందేహించవద్దు. నా వెంట నడవడమే మీరు చేయాల్సిన పని అని ఆయన క్యాడర్ కి కూడా చెప్పారు. సల సల మండే కొత్త నెత్తురుతో సరికొత్త రాజకీయాన్ని చేసేందుకు తాను వచ్చాను అని పవన్ అన్నారు.
నేను ఏ తప్పు చేశానని మీరు నాకు సలహాలు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. నేను అవినీతి చేశానా పదవులు అనుభవించానా ఎందుకు నన్ను మీరు ప్రతీ దానికీ విమర్శిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు నేను నా కష్టంతో పార్టీని నడుపుతున్నాను, పదేళ్ల పాటు నేను పార్టీని మోసి ఈ స్థాయికి తెచ్చాను, నేను నా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాను అని పవన్ వివరించారు.
నేను ఎపుడూ వెనక్కి తగ్గలేదని ఎవరు వచ్చినా లేకపోయినా నా మార్గం అలాగే సాగుతుందని పవన్ చెప్పారు. జగన్ వంటి ప్రత్యర్ధితో పోరాడుతూంటే సహకరించాల్సింది పోయి ఈ సలహాల్తో వెనక్కి లాగుతారా అని ఆయన మండిపడ్డారు. జగన్ ఏ తప్పు చేసినా వెనకేసుకుని వచ్చే అతి పెద్ద సైన్యం ఆయనకు ఉంది. మరి నేను ఏ తప్పూ చేయకపోయినా కూడా విమర్శించేవారు ఉండడం బాధాకరం అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకీ నేను ఏమి సొంతంగా సాధించాను, ప్రజల కోసం నేను పడే తపనను అర్ధం చేసుకోలేకపోతే ఎలా అని ఆయన ఫైర్ అయ్యారు. నాతో ఉండేవారే నా వాళ్లు ఇదే నా మాట అంటూ పవన్ జనసేనలో అసంతృప్తులకు కూడా హెచ్చరించే విధంగా చెప్పేశారు.
ఇటీవల కాలంలో హరిరామ జోగయ్య వరసబెట్టి రాస్తున్న లేఖలు అలాగే ఇస్తున్న సలహాల మీదనే పవన్ ఈ విధంగా అన్నారు అని అంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్న అసంతృప్తికి కూడా తనదైన శైలిలో నచ్చచెబుతూనే సుతిమెత్తగా మందలించారు అని అంటున్నారు.