ఎన్నికల ప్రచారంలోకి పవన్... ముహూర్తం ఫిక్స్...!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు. అన్నీ అనుకున్నట్లు అయితే ఈ నెలాఖరు నుంచి మళ్లీ జనంలోకి పవన్ కళ్యాణ్ రానున్నట్లుగా తెలుస్తోంది.

Update: 2024-01-21 03:35 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు. అన్నీ అనుకున్నట్లు అయితే ఈ నెలాఖరు నుంచి మళ్లీ జనంలోకి పవన్ కళ్యాణ్ రానున్నట్లుగా తెలుస్తోంది. వారాహి యాత్ర పేరిట నాలుగు దశలుగా పవన్ ఏపీలో కొన్ని ప్రాంతాలలో పర్యటించారు. అయితే గత ఏడాది అక్టోబర్ మొదటి వారం తరువాత పవన్ జనంలోకి రాలేదు.

ఇక ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు కలసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తాయని అనుకుంటున్నారు. ఇక జనసేన టీడీపీకి సీట్ల కోసం లిస్ట్ ఇచ్చినట్లుగా తెలుసోంది. దానిని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కూర్చుని చర్చించిన తరువాతనే ఎవరికి ఎన్ని సీట్లు అన్నది లెక్క తేలుతుంది. ఇక జనసేనకు కేటాయించిన సెట్లు పూర్తిగా క్లారిటీ వస్తే ప్రచారం సులువు అవుతుందని పవన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

మరో వైపు చూస్తే ఏపీని అయిదు భాగాలుగా విభజించి మరీ తన పర్యటనను పవన్ పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రలో ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఆయన రాష్ట్రాన్ని విభజించారు. ఆయా జోన్లకు ఇంచార్జిలను కూడా నియమించారని తెలుస్తోంది.

ప్రతి జోన్‌లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉంటారని తెలుస్తోంది. అత్యంత పకడ్బంధీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారు పవన్ వారాహి యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారు. అదే విధంగా పవన్ సభలకు సంబంధించి అనుమతులు తీసుకోవడం వంటివి చేస్తారు.

ఇక ఈ నెలాఖరులోగా తమ పార్టీకి టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో తేల్చేయాలని పవన్ వత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. తమకు దక్కే సీట్లు ఎన్ని అన్నది తెలియాల్సి ఉందని పవన్ భావిస్తున్నారు. ఒకసారి పర్యటన మొదలుపెడితే ఎన్నికల ప్రచారం ముగిసేటంతవరకూ జనంలో ఉండేలా చూసుకోవాలని పవన్ భావిస్తున్నారుట.

చంద్రబాబు సైతం అభ్యర్ధుల జాబితా విషయంలో కసరత్తు చేస్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్ధుల జాబితా బయటకు వచ్చాకనే మొత్తం చూసిన మీదట బలమైన అభ్యర్ధులను ఎక్కడికక్కడ ఎంపిక చేయాలన్నది చంద్రబాబు ప్లాన్ అని అంటున్నారు. ఏది ఏమైనా ముందు జగన్ తేల్చిన తరువాతనే చంద్రబాబు తేలుస్తారు. ఆ మీదటనే పవన్ ఎన్నికల ప్రచారం ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News