విశాఖ భూ భాగోతం పైన కూటమి సీరియస్ యాక్షన్

చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం విశాఖలో భూములు గద్దలా పెద్దలు కొట్టేస్తున్నారు అని ఆరోపించారు కూడా.

Update: 2024-08-21 02:30 GMT

ఏపీలో స్మార్ట్ సిటీగా ఉన్న విశాఖలో భూ భాగోతాలు పైన టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ భాగోతాలను బద్ధలు కొట్టాలని దూకుడుగా ముందుకు అడుగులు వేస్తోంది. విశాఖలో గడచిన అయిదేళ్ల వైసీపీ పాలనలో లెక్కలేనన్ని భూ దందాలు చోటు చేసుకున్నాయని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన ఆరోపించాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం విశాఖలో భూములు గద్దలా పెద్దలు కొట్టేస్తున్నారు అని ఆరోపించారు కూడా.

ఇపుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అన్ని విషయాల మీద పూర్తిగా నివేదికలు తెప్పించుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం విశాఖ బూ భాగోతాల మీద సమగ్రమైన దర్యాప్తున ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఏపీలోనూ ఎక్కడెక్కడ భూ కబ్జాలు చోటు చేసుకున్నాయో వాటి మీద కూడా దర్యాప్తు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వంలోకి వచ్చాక టీడీపీ కూటమి పెద్దలు తరచూ అంటున్నది కూడా ఒక్కటే. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులలో అత్యధిక భాగం భూముల గురించే వస్తున్నాయని. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ ఫ్రీ హోల్డ్ పాలసీ భూ చట్టంలోని 22 ఏ సెక్షన్ల నుంచి అసైండ్ ల్యాండ్లకు మినహాయింపు ఇవ్వడంతో ఆ అసైండ్ ల్యాండ్ మీద కన్నేసిన పెద్దలు వాటిని తమ పరం చేసుకునేందుకు పెద్ద ఎత్తున కబ్జాలకు తెర తీశారు అన్నది ప్రధాన అభియోగం.

అలా ల్యాండ్ ఫ్రీ హోల్డ్ పాలసీని కేవలం వైసీపీ వారి కోసమే తెచ్చి దుర్వినియోగం చేశారని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల అమాయకులు అయిన అసైండ్ భూములను నమ్ముకున్న వారు భారీగా నష్టపోయారు అని కూడా అంటున్నారు. వీటి మీదనే పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కూడా ప్రభుత్వం సమగ్రమైన విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇక విశాఖలో చూసుకుంటే దసపల్లా హిల్స్ భూములు అలాగే హయగ్రీవా ఇన్ఫ్రా ల్యాండ్స్, రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన భూమిని అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలు, పెందుర్తి శారదా పీఠానికి భీమిలీలో పెద్ద ఎత్తున కట్టబెట్టిన భూముల పందేరాలను కూడా కూటమి ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది అని అంటున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఇటీవల రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా విశాఖ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించి ఆరోపణలు ఎదుర్కొంటున్న భూములను స్వయంగా పరిశీలించారు. అలాగే తహశీల్దార్లు ఇతర రెవిన్యూ అధికారులతో కూడా ఆయన కీలక సమావేశాలను నిర్వహించారు.

ప్రభుత్వ భూమిని తాము తప్పకుండా కాపాడుకుంటామని ఈ విషయంలో ఎవరైనా దురాక్రమళకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకే సిసోడియా పర్యటన సాగిందని అంతా అనుకున్నారు. ఇక సిట్ కొత్తగా వేస్తారా లేక రెవిన్యూ అధికారులే ఒక స్పెషల్ టీం గా ఏర్పడి ఈ దందాను తేలుస్తారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి ఈ భూ దందాల గుట్టు రట్టు చేయాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ముందుకు సాగుతోంది.

అయితే దీని మీద వైసీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఎటువంటి భూ దందాలు జరగలేదని అంటున్నారు. ప్రభుత్వం విచారణ జరిపించుకోవచ్చు అని నిజాలు వెల్లడి కావాల్సిందే అని అంటున్నారు. కొంతమంది వైసీపీ నేతలు అయితే 2014 నుంచి కూడా విశాఖ భూ దందాల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News