జనసేన క్యాడర్ కి పవన్ దిశా నిర్దేశం...!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. ముందు కూటమిని అధికారంలోకి రానీయండి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. ముందు కూటమిని అధికారంలోకి రానీయండి. ఆ తరూవాత అయిదేళ్ల పాటు అధికారం అనేక పదవులు వస్తాయి. ఆ విధంగా ప్రతీ వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విశాఖ పర్యటనలో బిజీగా ఉన్న పవన్ టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలతో పాటు ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఏపీలో జనసేన టీడీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఆ తరువాత లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అనేక నామినేటెడ్ పదవులు కూడా వస్తాయని ఆయన అంటున్నారు. మొత్తం ఈ పదవులలో మూడవ వంతు జనసేన తీసుకుంటుందని ఆయన చెబుతున్నారు. అందువల్ల జనసేన కోసం ఈ రోజు కష్టపడిన వారికి ఎవరికీ ఫ్యూచర్ లో నష్టం జరిగేందుకు వీలు ఉండదని ఆయన భరోసా ఇస్తున్నారు.
విశాఖ జిల్లాలో చూస్తే చాలా మంది నేతలు ఎమ్మెల్యే టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. వీరిలో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారితో పాటు కొత్తగా చేరిన వారు కూడా ఉన్నారు. వీరంతా తమకు పవన్ న్యాయం చేస్తారని భావిస్తున్నారు. అయితే పొత్తులో కొన్ని త్యాగాలు తప్పవు అన్నదే పవన్ చెబుతున్న సందేశంగా ఉంది.
ఈ ఎన్నికలతోనే అంతా అయిపోదు అన్నది పవన్ మాటగా ఉంది. ముందు కూటమిని గెలిపించుకోవడమే అతి పెద్ద ఆలోచనగా చెప్పుకొచ్చారు. ముందు మీరు పార్టీని గెలిపిస్తే ఆ మీదట పార్టీ మీకు న్యాయం చేస్తుంది అని పవన్ చెప్పిన మాటలుగా ఉన్నాయి.
తాను 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్న టైం లో కూడా ఇలా కొందరు నేతలకు న్యాయం చేసినట్లుగా ఆయన ఉదహరించారు. తాను వైసీపీని గద్దె దించేందుకు కృషి చేస్తున్నాను అని ఆ దిశగా అంతా కలసి రావాలని పవన్ కోరినట్లుగా చెబుతున్నారు.
మొత్తం మీద చూస్తే అతి తొందరలోనే సీట్ల విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. అలాగే బీజేపీతో పొత్తు అంశం కూడా తేలిపోతే ఉమ్మడి అభ్యర్ధుల జాబితా రిలీజ్ అవుతుందని కూడా అంటున్నారు. ఆ జాబితా విడుదలకు ముందు గ్రౌండ్ లో రియాలిటీస్ తెలుసుకోవడంతో పాటు ఆశావహులుగా ఉన్న నేతలను బుజ్జగించే పనిలో పవన్ ఉన్నారని అంటున్నారు.
నా మీద నమ్మకం ఉంచండి, నేను మీకు తగిన స్థానం కల్పిస్తాను అని పవన్ చెబుతున్నారు. మీరు ఇపుడు కూటమి విజయం కోసం కృషి చేయాలని ఆయన అంటున్నారు. మరి ఆశావహులు అంతా జనసేన కోసం అలాగే టీడీపీ విజయం కోసం పనిచేస్తరా లేదా అన్నది లిస్ట్ రిలీజ్ తరువాత తెలుస్తుంది అని అంటున్నారు.