గాంధీ - అంబేడ్కర్ తో తమను పోల్చుకున్న పవన్

పోలిక పోలవటం తప్పేం కాదు. వివరాలు.. విషయాలు మరింత స్పష్టంగా అర్థమయ్యేందుకు ఇలాంటివి మామూలే

Update: 2023-10-03 04:39 GMT

పోలిక పోలవటం తప్పేం కాదు. వివరాలు.. విషయాలు మరింత స్పష్టంగా అర్థమయ్యేందుకు ఇలాంటివి మామూలే. అయితే.. ఈ క్రమంలో ఎలాంటి కన్ఫ్యూజన్ గురయ్యేలా మాట్లాడకూడదు. చెప్పే విషయాన్ని సూటిగా.. సుత్తి కొట్టకుండా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకు భిన్నంగా విషయాన్ని సా..గదీస్తూ పోలికల మీద పోలికలు చెప్పేయటం ద్వారా.. ఓవర్ ల్యాప్ అయ్యే వీలుంది. తాజాగా జనసేన అధినేత పవన్ మాటల్ని చూస్తే.. ఇదే విషయం అర్థం కాక మానదు.

టీడీపీతో తన పార్టీ పొత్తు విషయంపై అందరి ఆమోదం పొందేందుకు ఆయన కొత్త పోలికల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. అయితే.. అవన్నీ పెద్దగా వర్కువుట్ కావట్లేదన్న మాట వినిపిస్తోంది. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో తమ సంబంధాలు పైన కీలక వ్యాఖ్యలు చేశారు.

జాతిపిత మహాత్మ గాంధీజీకి..దేశ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కు మధ్య సైద్ధాంతికంగా ఎన్నో అభిప్రాయ భేదాలు ఉన్నట్లుగా పేర్కొన్న పవన్.. వారిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఉదాహరణతో చెప్పుకొచ్చారు. ‘‘మహాత్మా గాంధీ.. అంబేడ్కర్ మధ్య ఎన్నో అభిప్రాయ బేధాలు ఉంటాయి. ఫూణెలో జరిగిన సమావేశంలో గాంధీ.. అంబేడ్కర్ మధ్య పలు అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ దేశ ప్రజయోజనాల కోసం మేధావి అయిన అంబేడ్కర్ ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ గా నియమించారు’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలిసేందుకు గాంధీ ఎలా అయితే నిర్ణయం తీసుకున్నారో.. తాను కూడా అలానే తీసుకుంటానని చెప్పారు. టీడీపీతో తమ పార్టీ పొత్తు సైతం.. ఏపీ ప్రజల ప్రయోజనాల్ని రక్షించేందుకేనని స్పష్టం చేశారు. పార్టీ స్థాపించిన వెంటనే పవర్లోకి రారని.. అది ఎన్టీఆర్ కే సాధ్యమైందన్న పవన్.. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాస్త కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి రావటం ఖాయమన్న మాటను పవన్ నోటి నుంచి జారిపోయింది. బీజేపీ అనబోయి బీఎస్సీ అన్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News