ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం సరే.. పవన్‌కు ఎసరొస్తే.. సంగతేంటి?
ఇదొక అనూహ్య ఆహ్వానం.. పైగా కీలక సమయంలో కేంద్రం నుంచి లభించిన అవకాశం.
ఇదొక అనూహ్య ఆహ్వానం.. పైగా కీలక సమయంలో కేంద్రం నుంచి లభించిన అవకాశం. దీంతో దీనిని సద్వినియోగం చేసుకు నేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అదే.. ఈ నెల 18న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగనున్న ఎన్డీయే భేటీ. ఇది అచ్చంగా ఎన్డీయే పక్షాలతో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు నిర్వహిస్తున్న కీలక సమావేశం. అది కూడా తీవ్ర వివాదంగా మారిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై చర్చించనున్నారు. ప్రధానంగా.. రాజ్యసభలో ఈ బిల్లును పాస్ చేయించుకునే లక్ష్యంతోనే మోడీ ఈ ఎన్డీయే భేటీకి పిలుపునిచ్చారు.
ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. అసలు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేని జనసేన పార్టీని కూడా ఆహ్వానించడం.. పవన్‌కు ఆహ్వానం పంపించడం ఆసక్తిగా మారింది. సరే.. బీజేపీ పొత్తు పార్టీ కాబట్టి పిలిచారని సరిపెట్టుకున్నా.. ఇక, ఈ ఎన్డీయే భేటీలో పవన్ ఏం చెబుతారు? అనేది కూడా ఇంట్రస్టింగ్‌గానే మారింది. ఇప్పటి వరకు పవన్ ఎవరికీ వ్యతిరేకంగా లేరు. వ్యతిరేకమని ఎవరూ అనుకోవడం లేదు. బీజేపీతో చేతులు కలిపినా.. మైనారిటీ వర్గాలకు ఆయన దూరంగా జరగకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.
సో.. పవన్ కళ్యాణే చెబుతున్నట్టు ఈ పార్టీ అందరిదీ.. అనే మాట క్షేత్రస్థాయిలోనూ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలా ముం దుకు సాగుతారు? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పటికైతే.. మైనారిటీ ముస్లింలకు జనసేన వ్యతిరేకం కాదనేది స్పష్టమే. అయితే.. ఇప్పుడు ఎన్డీయే భేటీకి హాజరు కావడం అనేదే చర్చనీయాంశంగా మారింది. ఇది అచ్చంగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ముందస్తు ఆమోదం పొందేందుకు ఏర్పాటు చేసిన సమావేశం అనేది నిర్వివాదాంశం. సో.. ఇలాంటి భేటీకి జనసేన అధినేతగా పవన్ హాజరైతే.. ఈ పరిణామం వేరేగా ఉంటుందనేది పరిశీలకులు చెబుతున్న మాట.
మైనారిటీ వర్గాల్లో పవన్‌కు ఉన్న ఇమేజ్ తగ్గిపోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని.. అదేసమయంలో ప్రత్యర్థి పక్షాలకు ఆయుధాలను అందించినట్టు అవుతుందనికూడా కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే.. ఇదే విషయంపై మరో చర్చ కూ డా నడుస్తోంది. పవన్‌కు ఇప్పటికిప్పుడు ప్రజాప్రతినిధులు లేరుకాబట్టి ఆయన ఎన్డీయే భేటీకి వెళ్లినా.,. అక్కడ ఏం చేసినా.. ఏం చెప్పినా.. పార్లమెంటులో చేసేదిఏం లేదుకనుక ఈ ప్రభావం పెద్దగా పడదని అనేవారు కూడా ఉన్నారు. అయితే. ఇలాంటి భేటీలకు వెళ్లడం ద్వారా దేశవ్యాప్తంగా పవన్ పరిచయాలు పెరుగుతాయని.. జనసేన నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా ఎన్డీయే కూటమి భేటీలో పవన్ ఏం చెబుతారో చూడాలి.