ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో పవనే చెప్పాలి... కమలం మధనం !

పవన్ పొత్తులో ఉన్నది టీడీపీతోనా లేక బీజేపీతోనా అన్నది తేల్చాల్సింది ఆయనే అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-10-03 12:11 GMT

ఏపీలో జనసేన ఏ పార్టీతో పొత్తులో ఉందో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పాలని బీజేపీ అంటోంది. ఈ విషయంలో పవన్ ఫుల్ క్లారిటీ ఇవ్వాలని ఆయన అంటున్నారు. పవన్ పొత్తులో ఉన్నది టీడీపీతోనా లేక బీజేపీతోనా అన్నది తేల్చాల్సింది ఆయనే అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం పవన్ వైఖరి మీదనే చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో పవన్ బీజేపీతో అఫీషియల్ గా పొత్తులో ఉన్నారు. అది ఈ రోజుకీ కొనసాగుతోంది. నిన్నటికి నిన్న ఎన్డీయే మిత్రుడిగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రధాని మోడీతో కరచాలనం చేసి వచ్చారు.

అది అలా ఉండగానే చంద్రబాబు అరెస్ట్ జైలు జీవితం తరువాత ఏకంగా రాజమండ్రి జైలు బయటనే టీడీపీతోనే పొత్తు అంటూ ప్రకటన ఇచ్చేశారు. దీంతోనే బీజేపీ షాక్ తిన్నది. అయితే దానికి కాస్తా ఊరడింపుగా అన్నట్లు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీతో తాను పొత్తులో ఉన్నానని, అందువల్ల టీడీపీతో పొత్తు విషయం ఆ పార్టీ పెద్దలతో చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందని అన్నారు.

దీంతో ఏపీ బీజేపీ నేతలలో ఆశలు చిగురించాయి. పవన్ మూడు పార్టీలను కలుపుతారని అనుకున్నారు. అయితే వారాహి నాలుగవ విడతలో భాగంగా అవనిగడ్డలో పవన్ మాట్లాడుతూ ఏపీలో వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వం అన్నారు. దాంతో బీజేపీ మళ్లీ షాక్ తిన్నది. ఇక ఆ తరువాత కూడా పవన్ ఎక్కడా బీజేపీ పేరు చెప్పడం లేదు, టీడీపీ జనసేన పొత్తు అంటూ ముందుకు సాగిపోతున్నారు.

దీంతో అత్యవసరంగా బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ పెట్టి మరీ దీని మీద సీరియస్ గానే చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ కోసం వచ్చిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో టీడీపీతోనా లేక బీజేపీతోనా తన పొత్తు అనేది పవన్ స్పష్టంగా చెప్పాలని కోరడం విశేషం.

ఏపీలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి కొనసాగుతోందని అన్నారు. ఇతర పార్టీల నిర్ణయాలను బీజేపీ ఎలా చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఏ పార్టీతో బీజేపీకి పొత్తు ఉంటుంది లేక ఉండదు అన్నది అన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందని సత్యకుమార్ అంటుననరు.

అంతే కాదు ఏపీలో పొత్తులు రాజకీయాల గురించి తమ పార్టీ హై కమాండ్ కీలక సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మొత్తానికి చూస్తే బీజేపీలో కీలక నేత అయిన సత్యకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీ బీజేపీ జనసేన రాజకీయ పోకడలు పొత్తులలో స్టాండ్ మార్చుకోవడం వంటి వాటి మీద కాస్తా గుర్రుగా ఉందనే అంటున్నారు.

అదే సమయంలో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఏపీలో పరిస్థితులు చెప్పి ఆ మీదట తమ అభిప్రాయం కూడా చెప్పి హై కమాండ్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూడడమే కోర్ కమిటీ సమావేశం ఉద్దేశ్యం అని అంటున్నారు.

Tags:    

Similar News