సీఎం అభ్యర్ధిగా పవన్... ఏపీలో కొత్త రాజకీయానికి దారులు ....?

అంతే కాదు పవన్ సీఎం అభ్యర్ధి అంటే కచ్చితంగా బీజేపీ మద్దతు కూడా దక్కవచ్చు. కూటమిలో రెండవ మాట లేకుండా ఆ పార్టీ సైతం రావచ్చు.

Update: 2023-09-15 13:37 GMT

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అతీతంగానే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అది కూడా అత్యంత కీలకమైన పరిస్థితులలో. చంద్రబాబుకు గతంలో ఎవరు ఏమి సాయం చేశారో తెలియదు కానీ చంద్రబాబు ఏడున్నర పదుల ముదిమి వయసులో ఉన్న వేళ ఏ వైపు చూసినా నిరాశా నిస్పృహలే కనిపిస్తున్న వేళ కలలో కూడా ఊహించని విధంగా జైలులో నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న వేళ పవన్ ఇచ్చిన భరోసా మాటలలో చెప్పలేనిది. లెక్కకట్టేందుకు వీలు లేనిది.

అలాంటి పవన్ కళ్యాణ్ ఏపీ శ్రేయస్సు తనకు ముఖ్యమని ముందుకు వచ్చినపుడు తెలుగుదేశం కూడా అంతే ఉదారత్వాన్ని చూపాలని అంతా అంటున్నారు. ఏపీ రాజకీయాలు చూసుకుంటే అది 1953 నుంచి 2014 విభజన ఏపీ దాకా దాదాపుగా అన్ని ప్రధాన కులాల వారు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ కాపులు మాత్రం కాలేదు.

బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులకు సీఎం పదవి ఎపుడూ అందరి పండే అవుతోంది. గతంలో వంగవీటి మోహన రంగా నుంచి మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎంతో మందిని కాపులు ఆరాధించారు. సీఎం సీటు దాకా వారు వెళ్తారని ఆకాక్షించారు. కానీ అది జరగలేదు. కానీ జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ తనకు తోచిన తీరున రాజకీయాల్లో పోరాడుతున్నారు. ఆయన మీద ఈ రోజు దాకా అవినీతి మరకలేదు

పైగా ఇతర హీరోల కంటే భిన్నంగా ప్రజా సమస్యల మీద స్పందించడం పవన్ నైజంగా ఉంటోంది. ఈ రోజుకూ కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ ఆయనకు సినిమాల్లో లభిస్తుంది. కానీ అన్నీ వదులుకుని నంబర్ వన్ హీరో ఏపీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి జనసేన ఏపీలో అధికార పార్టీ మీద తన బలం సరిపోదని భావించి టీడీపీతో కలసి ముందుకు వచ్చింది.

అంతే కాదు టీడీపీ కష్ట సమయంలో బాసటగా ఉంది. దానికి బదులు ఎంత అంటే ఎంతైనా అని చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో చంద్రబాబుకు పవన్ కి ఉమ్మడి ప్రత్యర్ధి జగన్ అయినపుడు చంద్రబాబు ముమ్మారు సీఎం పదవిని చేసి ఉన్న వేళ ఏపీలో రాజకీయం మారాలని ఆశిస్తున్న వేళ పవన్ని సీఎం అభ్యర్ధిగా ముందు పెట్టి కూటమిని తీసుకెళ్తే కచ్చితంగా అది ఏపీ రాజకీయాలలో సంచలనం అవుతుంది అని అంటున్నారు.

అంతే కాదు పవన్ సీఎం అభ్యర్ధి అంటే కచ్చితంగా బీజేపీ మద్దతు కూడా దక్కవచ్చు. కూటమిలో రెండవ మాట లేకుండా ఆ పార్టీ సైతం రావచ్చు. ఏపీని బాగుచేయాలని కోరుకుంటున్న చంద్రబాబు కూటమికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఉంటూ పెద్దగా సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపించవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా జనసేన క్యాడర్ సైతం పవన్ని సీఎం గా కోరుకుంటారు.

ఫలానా వర్గానికి టీడీపీ ఎంతో చేసిందని తరచూ చంద్రబాబు చెబుతూ ఉంటారు. టీడీపీని బీసీల పార్టీ అంటారు. అలాంటి టీడీపీని కాపుల పార్టీగా మార్చడానికి ఇదే సరైన అదను అంటున్నారు. పవన్ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించి చంద్రబాబు తన వ్యూహాలతో పోరాడితే భారీ రాజకీయ ప్రయోజనాలు దక్కుతాయని అంటున్నారు.

అలా కాకుండా చంద్రబాబే మళ్లీ సీఎం అని చెబుతూ జనసేనకు ఎన్నో కొన్ని సీట్లు ఇస్తే మాత్రం ఈ పొత్తు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. పవన్ కి అధికార కాంక్ష లేకపోవచ్చు. ఆయన చంద్రబాబుకు మద్దతు ఇవ్వవచ్చు. కానీ జనసైనికులు తీవ్ర నిరాశకు లోను అవుతారు. అదే విధంగా కాపులలో చీలిక వస్తుంది. వారి ఓట్లు టోటల్ గా కూటమికి పడతాయని ఎవరూ చెప్పలేరు అంటున్నారు.

మరి చంద్రబాబు కలలో కూడా ఊహించని విధంగా జైలు జీవితం గడుపుతున్న వేళ పవన్ వచ్చి మద్దతు ఇచ్చారు. పవన్ కి బాబు చేసేది ఏమైనా ఉందంటే అది ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ఏపీలో కొత్త రాజకీయానికి దారులు తేరవడమే విజనరీగా బాబు చేయాల్సినది ఉంటుంది అంటున్నారు.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తులు పెద్దగా ఫలించవు అని అనుకుంటున్న వారికి చంద్రబాబు తన ఎత్తులతో జవాబు చెప్పాలంటే ఇంతకు మించిన ఆప్షన్ లేనేలేదు అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయ అద్భుతాలే జరుగుతాయని కూడా అంటున్నారు మరి దీని మీద టీడీపీ అధినాయకత్వం ఏమంటుందో.

Tags:    

Similar News