జైల్లో చంద్రబాబు నలిగిపోయారు: పవన్ కల్యాణ్

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం జరిగింది

Update: 2024-06-11 09:16 GMT

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం జరిగింది. కూటమి తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ఈ సమావేశానికి హాజరై చంద్రబాబును ఎన్డీఏ కూటమి శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్‌ ప్రతిపాదించగా...ఆ తీర్మానాన్ని కూటమి నేతలు ఏకగ్రీవంగా అంగీకరించి ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్ కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్‌ ఆహ్వానం పలకనున్నారు. తనను ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమాశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పక్కనపెట్టుకొని తాను ఒక మాట చెప్పాలని, జైల్లో ఉన్నపుడు ఆయన చాలా నలిగిపోయారని, తాను చూశానని ఎమోషనల్ అయ్యారు. భువనేశ్వరిగారి బాధను చూశాను, అమ్మా మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని ఆ రోజు జైల్లో చెప్పానని, తాను అన్నట్లే మంచి రోజులు వచ్చాయని పవన్ చెప్పారు.

మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి సుపరిపాలన కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఆ సుపరిపాలనను చంద్రబాబు అందజేయాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. కూటమి అంటే ఎలా ఉండాలి, కలసికట్టుగా ఎలా ఉండాలి అని చేసి చూపించామని చెప్పారు. రాష్ర్టంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని, కాబట్టి కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు.

Tags:    

Similar News