వారసత్వంపై పవన్ వ్యాఖ్యలు.. ఇంత నిజాయితీ పనిచేస్తుందా.. ?
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తనకు వారసత్వ రాజకీయాలు వద్దని.. ఇలాంటి నాయకులు తన పార్టీలోనే ఉండేందుకు అర్హులు కారని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో నిజాయితీ.. నియమాలు.. గురించి మాట్లాడుకునే రోజులా ఇవి! పాటించే రోజులా ఇవి!! అంటే.. కానేకాదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. ఇప్పుడున్న రాజకీయాలు అవసరం-అవకాశం అనే రెండు పట్టాలపైనే ప్రయాణం చేస్తున్నాయి. అలాగని నిజాయితీగా ఉండొద్దనికాదు. నియమాలు పాటించొద్దని కూడా కాదు. కానీ, ప్రస్తుతం రోజులు ఎప్పుడో మారిపోయాయి. రాజకీయాల్లో ఎన్ని వ్యూహాలు పన్నేవారు.. ఉంటే.. అంత పైకి వస్తున్న రోజులు. సో.. ఇప్పుడు నీతులు పట్టుకుని వేలాడే నాయకులు ఒక్కరు కూడా లేరు.
ఒకవేళ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, లోక్ సత్తా మాజీ చీఫ్ జయప్రకాష్ నారాయణ, కమ్యూనిస్టులు వంటివారు ఉన్నా.. వారు రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నారో.. ఎంత ప్రజాదరణను పొందారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సో.. రాజకీయాలు కాలానుగుణంగా.. ప్రజల మనసులతోను.. వారి చర్యలతోనూ ముడిపడిపోయాయి. ఓటు వేసేందుకుసొమ్ములు తీసుకోవడం.. ఒకప్పుడు అతి రహస్యం. ఇప్పుటు దాదాపు అప్రకటిత చట్టబద్ధం అనేభావన ప్రజల్లోకి వచ్చేసింది. డబ్బులు ఇవ్వకపోతే.. ఎందుకు ఓటేయాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. ఓటు వేయాలంటే.. డబ్బులు ఇవ్వాల్సిందే. అంటూ.. ఇటీవల జరిగిన అఅసెంబ్లీ ఎన్నికల్లో నే తూర్పు గోదావరిలో అర్ధరాత్రి మహిళలు పోటెత్తిన ఘటన.. గలాభా చేసిన ఘటనలను మనం మరువ లేం. సో.. రాజకీయాల్లో నీతులు.. వారసత్వాలను వద్దనుకునే పరిస్థితి.. సాహసం కూడా చేసేందుకు ఏపార్టీ కూడా ముందుకు రావడం లేదు. వచ్చిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సరే.. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తనకు వారసత్వ రాజకీయాలు వద్దని.. ఇలాంటి నాయకులు తన పార్టీలోనే ఉండేందుకు అర్హులు కారని వ్యాఖ్యానించారు.
కానీ, రాజకీయాలు అలా లేవు. ఉంటే.. ఈ రాష్ట్రమే కాదు.. దేశం కూడా ఎప్పుడో బాగుపడి ఉండేది. కౌన్సిలర్ నుంచి ఎంపీ వరకు.. అందరూ వారసుల బాట పడుతున్న సమయంలో పవన్ చెబుతున్న నీతిమయ రాజకీయాలు.. నేటి నీతిలేని రాజకీయాల ముందు.. సరితూగుతాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాదు.. నిజాయితీ పనిచేయడమూ నాయకులకు సాధ్యం కాదు. ప్రజలను ఓటుకు నోటు కోసం.. మభ్యపెట్టిన తర్వాత.. వారిని కరెన్సీకి అలవాటు చేసిన తర్వాత.. ఇప్పుడు నీతులు చెబితే.. వినేవాడు.. పట్టించుకునే వాడు కూడా లేరు. మరి ఈ విషయంలో పవన్ ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.