తూర్పులో పవన్ సీటు కన్ ఫాం!... తెరపైకి వారాహి ఫైట్!

దీంతో ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్... ఈరోజు కూడా కాకినాడ సిటీ సీటుపై చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.

Update: 2023-12-29 07:33 GMT

గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సమయంలో గాజువాక, భీమవరాల్లో రెండు చోట్ల పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... గాజువాకలో 14,520.. భీమవరంలో 8,357 ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందడం ప్రమాధం ఉందని.. టీడీపీతో కలిసి ప్రయాణిస్తున్న పవన్ కల్యాణ్ ఈ దఫా ఎక్కడి నుంచి పోటీచేస్తారు అనేది ఆసక్తిగా మారింది.

ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఈ సారి పోటీ చేసే సీట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. కేవల ఈలలు, గోలలు తనకు ఓట్లుగా మారవని గ్రహించారని.. ఈ సమయంలో టీడీపీ కూడా బలంగా ఉన్న చోట్ల, జనసేనకు ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గాన్ని ఫైనల్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది.

అవును... వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ, బీజేపీ వంటి పార్టీల్ని కలుపుకుని బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని తపిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీతో సీట్ల సర్దుబాటులో భాగంగా... తాను పోటీ చేసే సీటుపై కూడా పలు నియోజకవర్గాల్ని ఆయన పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... కాకినాడతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాలపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారని.. జనసేన పార్టీకి చెందిన పలువురు నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో కాకినాడ సిటీకి సంబంధించిన స్థానిక నాయకత్వంతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుగుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో... కాకినాడ సిటీపై పవన్ ఆసక్తికరంగా ఉన్నారని అంటున్నారు.

వాస్తవానికి కాకినాడ నగరపాలకసంస్ధ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా... వీటిలో జనసేన పార్టీకి అంత బలం లేదనే కామెంట్లు వినిపిస్తున్నా.. సొంత సామాజిక వర్గం నేతలకు మాత్రం కొదవలేదు. ఇదే సమయంలో టీడీపీ మద్దతు కూడా ఉంటుంది కాబట్టి... కాకినాడ సిటీ సీటు నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండొచ్చన్న అంశపై పవన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్... ఈరోజు కూడా కాకినాడ సిటీ సీటుపై చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. కాగా... కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ తన వారాహి యాత్ర సమయమంలో ఫుల్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ధమ్ముంటే తనపై పోటీ చేయాలని ద్వారంపూడి ఛాలెంజ్ విసిరారు!

Tags:    

Similar News