అన్న కోసం పవన్ నియోజకవర్గం ఫిక్స్... బాబు పర్మిషన్?

అవును... 2019ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన నాగబాబు... మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Update: 2024-02-07 05:39 GMT

ఈసారి ఎన్నికల్లో జగన్ సర్కార్ ను ఎలాగైనా గద్దె దింపాలని టీడీపీ - జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీట్ల సర్దుబాట్లు, సీఎం కుర్చీ వ్యవహారం ఇరు పార్టీల మధ్య సమస్యలకు కారణమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీని గద్దె దింపడం అంటే.. టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని పలువురు జనసేనానికి సూచిస్తున్నా.. అవి వినిపించుకుంటున్నట్లు లేదు! ఆ సంగతి అలా ఉంటే... తన అన్న నాగాబాబు కోసం పవన్ ఒక నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

అవును... 2019ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన నాగబాబు... మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానంలో టీడీపీ నుంచి రఘురామకృష్ణంరాజు పోటీని నిలబడుతున్న నేపథ్యంలో... నాగబాబు ఎక్కడి నుంచి పోటీచేయాలి అనే విషయంలో సందిగ్ధంలో పడ్డారని అంటున్నారు. పైగా... జనసేనకు 2 లోక్ సభ స్థానాలే కేటాయించినట్లు చెబుతున్న నేపథ్యంలో మచిలీపట్నం, కాకినాడకు జనసేన అభ్యర్థులు రెడీగా ఉన్నారు!!

ఇందులో భాగంగా... వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీష్ కుమార్ కు కాకినాడ ఇస్తారని చెబుతున్నారు! ఈ సమయంలో తన అన్న నాగబాబు కోసం మరో టిక్కెట్ ఇవ్వాలని పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... అనకాపల్లి లోక్ సభ స్థానం అయితే సేఫ్ సీటు అని పవన్ భావిస్తున్నారని.. నాగబాబు కోసం ఆ సీటు అడుగుతున్నారని అంటున్నారు.

వాస్తవానికి అనకాపల్లి లోక్ సభ స్థానం విషయంలో టీడీపీలోనే గట్టి పోటీ ఉందనే చెప్పుకోవాలి. ఈ టిక్కెట్ కోసం బైరి దిలీప్ చక్రవర్తి, చింతకాలయ విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు! అయితే వీరిద్దరిలో చంద్రబాబు ఎవరికి టిక్కెట్ కన్ ఫాం చేస్తారనే విషయంలోనే సందిగ్దత నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు రూపంలో ఈ టిక్కెట్ కోసం మరో ఎంట్రీ వచ్చింది! దీంతో... ఇక్కడ టిక్కెట్ కోసం టఫ్ ఫైట్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంలో పవన్ కాస్త గట్టిగానే బాబు వద్ద పట్టుబట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోపక్క చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ విషయంలో బాబు నుంచి భరోసా తీసుకున్నారనే చర్చ ఒకపక్క నడుస్తుంది. మరోపక్క నాగబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. దీంతో ఆయనకు తమ్ముడు నుంచి హామీ వచ్చి ఉంటుందని చర్చ నడుస్తుంది. మరి అనకాపల్లి లోక్ సభ స్థానంపై ఏవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి!!

 

Tags:    

Similar News