జ‌న‌సేన‌లో క‌ల‌క‌లం... ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌..?

ఇక మహిళా భ‌ద్ర‌త‌కు పెద్దపీట వేస్తామని రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు.

Update: 2024-07-17 15:30 GMT

రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రజలకు కొన్ని హామీలను గుప్పించారు. ప్రధానంగా ఆయన సిపిఎస్ విషయంలో ఏడాదిలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అదేవిధంగా రాయలసీమకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు రహదా రుల నిర్మాణం వంటి విషయంలో కూడా ఆయన కీలక హామీలు ఇచ్చారు. ఇక మహిళా భ‌ద్ర‌త‌కు పెద్దపీట వేస్తామని రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామ‌న్నారు.

ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఆ పదవి చేపట్టి నెలరోజులు దాటిపోయిన ఇప్పటివరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన కూడా చేయలేకపోయారు. ఇదే విషయం తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు గుర్తు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వడివడిగా అమలు చేస్తోంది. వీటిలో పింఛన్ల పెంపు ఇప్పటికే అమలైంది. వీటితో పాటుగా అన్నా క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కీలకమైన హామీలను అమలు చేస్తున్నారు.

మరి ఇదే సమయంలో జనసేన తరపున పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల విషయం ఏంటి? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్నికల సమయంలో కూటమి తరపున ఇచ్చిన హామీలతో పాటు వ్యక్తిగతంగా పవన్ మరికొన్ని హామీలను ఇచ్చారు. దీంతో ఆయా హామీల విషయంలో జనసేన నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు ఆయా హామీల మీద ఏం చెప్పాలి? అనేది ప్రస్తుతం పవన్‌కు వారు సంధించిన ప్రశ్న. అయితే ఈ విషయంలో పవన్ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి జనసేన కూటమిగా పోటీ చేస్తుందా? లేక ఒంటరిగా పోటీ చేస్తుందా అనే విషయం ఎలా ఉన్నా ఒకవేళ అవకాశాన్ని బట్టి ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే 2024 ఎన్నికల సమయంలో పవన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అనే ప్రశ్న కచ్చితంగా తెరమీదకి వస్తుంది. అప్పుడు సమాధానం చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. ఇదే విషయాన్ని జనసేన నాయకులు పవన్ ముందు పెట్టారు.

స్వతంత్రంగా మనం ఇచ్చిన హామీల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. కానీ పవను మాత్రం ఈ విషయాన్ని తనకు వ‌దిలేయాలని తాను చూసుకుంటాన‌ని చెప్పడం గమనార్హం. కానీ, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో మాత్రం సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఇలాగే ఉంటే ఎన్నికల నాటికి పవన్‌ ఇచ్చిన వ్యక్తిగత హామీలు అమలు కాకపోతే జనసేన పార్టీపై ప్రజల్లో ఒకంత విశ్వాసం స‌న్న‌గిల్లే ప‌రిస్థితి కనిపిస్తుందన్నది జనసేన నాయకుల సూచన. దీనిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News